ఓయూ వీసీని తక్షణమే తొలగించాలి : విద్యార్థుల డిమాండ్​

by Disha Web Desk 15 |
ఓయూ వీసీని తక్షణమే తొలగించాలి  : విద్యార్థుల డిమాండ్​
X

దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విధులు మాని రాజకీయాలు చేస్తున్నాడని, ఆయన్ని తక్షణమే తొలగించాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. యూనివర్సిటీ పీహెచ్డి పరీక్ష విధానం, కొత్త నిబంధనల ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ మేరకు ఐక్య విద్యార్ది సంఘాల అధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ రోస్టర్ విధానం లేకపోవడం, వీసీ కఠిన నిబంధనల వల్ల చాలా శాఖల్లో అడ్మిషన్లు మిగిలిపోతున్నాయని తెలిపారు. కక్షపూరితంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడానికే వీసీ రవీందర్ యాదవ్ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

నిరసనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నాడని మండి పడ్డారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ సోమవారం యూనివర్సిటీ బంద్​కు పిలుపునిస్తే, బంద్‌ కు భంగం కలగాలని ప్రొఫెసర్లతో నిరసన కార్యక్రమం చేపించడం నీచమైన చర్య అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాలు నింపుకోవాలని ప్రభుత్వం జీఓ ఇస్తే వీసీ దాన్ని తొక్కి పెట్టారని ఆరోపించారు. పీ హెచ్ డీ అడ్మిషన్ ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడని ప్రొఫెసర్లు యూనివర్సిటీ బంద్‌ పిలుపునిచ్చిన రోజు ప్రొఫెసర్ల నియామకం పైన నిరసన కార్యక్రమం చేపట్టడం వెనుక అర్దం ఏమిటో విద్యార్ది లోకానికి తెలుసు అన్నారు. వర్సిటీలో విద్యా, నైపుణ్యాలను పెంపొందించాల్సిన వీసీ, ప్రొఫెసర్లు విద్యార్థులతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను కొట్టేసి, అరెస్టైన వారిని విడుదల చేసి వీసీ ని బర్తరఫ్ తొలగించాలని వారు డిమాండ్ చేశారు.



Next Story