నిరంజన్ రెడ్డిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి : రాచాల యుగంధర్ గౌడ్

by Disha Web Desk 20 |
నిరంజన్ రెడ్డిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి : రాచాల యుగంధర్ గౌడ్
X

దిశ, కార్వాన్ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భూ ఆక్రమణల పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా రాచాల మాట్లాడుతూ గతంలో ఆరోపణలు వచ్చిన తాటికొండ రాజయ్య పై, ఆకాశ రామన్న ఉత్తరం వచ్చిందని ఈటెల రాజేందర్ పై చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్ అగ్రకులానికి చెందిన నిరంజన్ రెడ్డిని మాత్రం ఎందుకు వెనుకేసుకొస్తున్నారని యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కున్న మంత్రి పై లోకాయుక్త, ఈడీ, గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికైనా ఆయనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి, విచారణకు ఆదేశించాలని, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. ఇటీవల వనపర్తి నియోజకవర్గ కేంద్రంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభ విజయవంతం అయ్యిందని, దీన్ని తట్టుకోలేని మంత్రి మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనకు చూపు కూడా మందగించినట్లుందని, కంటివెలుగులో మంచి అద్దాలు ఇచ్చి, మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ మంత్రికి ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు గోనెల శ్రీనివాస్ ముదిరాజ్, శేఖర్ గౌడ్, కేశవులు, వెంకటేష్, నరేష్ గౌడ్, నిరంజన్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed