కారు డ్రైవర్​ నిర్లక్ష్యం...రెండేళ్ల చిన్నారి మృతి

by Sridhar Babu |
కారు డ్రైవర్​ నిర్లక్ష్యం...రెండేళ్ల చిన్నారి మృతి
X

దిశ, ఎల్బీనగర్ : ఎల్బీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీనగర్‌ మన్సూరాబాద్ రోడ్డులో ఓ డ్రైవర్ నడిరోడ్డుపై కారును ఆపాడు. అంతేకాకుండా ముందు వెనకా చూసుకోకుండా నిర్లక్ష్యంగా కారు డోర్‌ను తెరిచాడు. అయితే ఇదే సమయంలో వెనుక నుంచి ఓ దంపతులు తమ చిన్నారితో కలిసి బైక్‌పై వస్తున్నారు.

ఒక్కసారిగా కార్ డోర్ తెరుచుకోవడంతో వెనక నుంచి వస్తున్న బైక్‌కు తగిలి దంపతులు, చిన్నారి కిందపడిపోయారు. కారు డోర్‌ బలంగా తగలడంతో చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి శశిరేఖ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శశిరేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరు మన్సురాబాద్ నుంచి ఎల్బీనగర్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed