డాక్టర్ల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి

by Disha Web |
డాక్టర్ల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి
X

దిశ, శేరిలింగంపల్లి: రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన గర్భిణీకి డాక్టర్ల నిర్లక్ష్యం, నర్సు అత్యుత్సాహంతో నవజాత శిశువు మరణించిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సూర్య ఏడాదిన్నర క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుని నగరానికి వలస వచ్చాడు. కొండాపూర్ పోలీస్ బెటాలియన్‌కు సమీపంలో నివాసం ఉంటూ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో సూర్య భార్య గర్భవతి అయింది. దీంతో సమీపంలోని కొండాపూర్ లీఫ్ హాస్పటల్‌లో మొదటి నెల నుండి రెగ్యులర్ చెకప్ చెయ్యిస్తున్నారు. అదే క్రమంలో ఈసారి కూడా చెకప్ చేయించుకున్నారు.

అయితే సోమవారం 6 నెలల కడుపునొప్పితో ఆమె ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఉన్న నర్స్ ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. డాక్టర్ సుజాతకు ఫోన్ చేసి ఆమె సూచనల మేరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకు ఇంజెక్షన్ చేశారు. అలాగే స్కానింగ్ చేసి బిడ్డ బాగానే ఉందని తెలిపారు. ఇంతలో బాత్రూంకని వెళ్లిన గర్భిణీ తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చి బిడ్డ తల బయటకు కనిపిస్తుందని అక్కడే ఉన్న నర్స్‌కు తెలిపింది. కానీ ఆమె ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేయడంతో బిడ్డ పూర్తిగా బయటకు వచ్చేసింది.

ఆ తర్వాత అక్కడికి చేరుకున్న డాక్టర్ సుజాత వెంటనే బిడ్డ పేగును కట్ చేసి, నవజాత శిశువును అక్కడే వదిలేసిందని, ఆ తర్వాత హడావుడిగా సీఆర్ ఫౌండేషన్ స్మశాన వాటికలో తమ బిడ్డను పూడ్చిపెట్టారని బాధిత కుటుంబీకులు తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని, ఇదంతటికి డాక్టర్లే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

మా దగ్గరికి వచ్చేప్పటికే ఆమె ఇబ్బందులు పడుతుంది.. డాక్టర్ సుజాత దేవ

సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పేషేంట్ మౌనిక మా దగ్గరకు కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. అప్పటికే ఆమెకు బ్లీడింగ్ అవుతుంది. మా నర్సు ప్రాథమిక చికిత్స అందించి ట్రీట్మెంట్ చేసింది. అయితే ఒక్కసారిగా బ్లీడింగ్ కావడంతో 6వ నెలలలోనే ఆమె నెలలు నిండని బాబుకు జన్మనిచ్చింది. తక్కువ నెలలో పుట్టడంతో శిశువు ఆరోగ్యం బాగాలేక మృతి చెందింది. అందులో మా నిర్లక్ష్యం ఏమీలేదు. ఆమెకు నొప్పులు వచ్చిన వెంటనే మా దగ్గరకు వస్తే చికిత్స అందించే వాళ్లం. వాళ్ల నిర్లక్ష్యం వల్లనే శిశువు మృతి చెందింది.

నవజాత శిశువుకు పోస్ట్ మార్టం

నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ మృతి చెందడంతో ఆ పసిపాపను సీఆర్ ఫౌండేషన్ స్మశానవాటికలో పూడ్చిపెట్టగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు తహశీల్దార్ సమక్షంలో వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు.

Next Story

Most Viewed