నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

by Vinod kumar |
నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
X

దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వెళ్లే మార్గంలో నాగోల్ చౌరస్తా వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను బుధవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాగోల్ ఫ్లైఓవర్ కోసం భూసేకరణతో పాటు ప్రాజెక్టు మొత్తం కలిపి రూ.143.58 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇది 990 మీటర్ల పొడవుతో 6 లైన్‌లతో నిర్మించబడిందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్ నుండి ఎల్బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుందని వివరించారు.

హైదరాబాద్ మహానగరం చుట్టూ విస్తరిస్తుందని అన్నారు. నగర విస్తరణకు, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతుందని అందుకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, ఎస్ఆర్డీపీ కింద మొత్తం 47 పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు.


ఇప్పటి వరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో 16 పురోగతిలో ఉన్నాయని వివరించారు. పూర్తయిన 31 పనుల్లో 15 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నాగోల్ ఫ్లైఓవర్ వరుసగా 16 వది అన్నారు. చాలామంది ప్రజలు నగరంలోకి రావడానికి ఇదే ప్రధాన మార్గమని తెలిపారు. ఫ్లై ఓవర్ల పరంపర ఇక్కడితో ఆగలేదని.. జనాభా అవసరాలకు అనుగుణంగా మరిన్ని నిర్మించడం జరుగుతుందని చెప్పారు. మాదాపూర్, గచ్చిబౌలి లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి త్వరలో మరో రెండు ఫ్లైఓవర్లు రానున్నాయని తెలిపారు. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్ కాగా మరొకటి శిల్పకళా వేదిక వద్ద అని.. ఈ రెండు పనులు త్వరలోనే పూర్తవుతాయని, డిసెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.


చివరిగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం తప్పిదం వల్ల ఏర్పడ్డ రిజిస్ట్రేషన్‌ల సమస్యను నాలుగైదు రోజుల్లో పరిష్కరిస్తానని, మరో ఐదు రోజుల్లో వచ్చి జీవో విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో.. అక్కడున్న వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు బొగ్గారపు దయానంద్ గుప్తా, యేగ్గే మల్లేశం, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, స్థానిక కార్పొరేటర్లు చింతల అరుణ, సురేందర్ యాదవ్, పవన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story