గొప్ప మహనీయుడిని అవమానించారు: కాంగ్రెస్ నేతలపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్

by srinivas |   ( Updated:2025-04-14 17:30:45.0  )
గొప్ప మహనీయుడిని అవమానించారు: కాంగ్రెస్ నేతలపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బాబా సాహెబ్​అంబేద్కర్ పట్ల ఉన్న భక్తి, గౌరవంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆశయాలను, ఆలోచనలను అమలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతోందని రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్​పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయుడని, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను లోతుగా అధ్యయనం చేసి, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగంలో పెద్దపీట వేసి అనేక హక్కులు కల్పించారు. సోమవారం బిజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్​జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతర ప్రసంగిస్తూ ఆయనను కాంగ్రెస్ పార్టీతో పాటు అప్పటి ప్రధాని నెహ్రూ అడుగడుగునా అనేకసార్లు అవమానపర్చారని మండిపడ్డారు. న్యాయశాఖ మంత్రిగా ప్రథమ కేంద్ర మంత్రివర్గంలో తన ప్రతిభను చాటినా, నెహ్రూ ఆయనను రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చారని తెలిపారు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ స్పష్టమైన వ్యతిరేకతను కాంగ్రెస్ పట్టించుకోలేదని, నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ రాజకీయాలను అనుసరించిందన్నారు. హిందూ సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు హిందూ కోడ్ బిల్ రూపొందించినా, కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్డుకుంది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ హక్కులు కల్పించినా, బీసీల కోసం జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సూచించినా, నెహ్రూ పట్టించుకోలేదు.

రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని మొసలికన్నీరు కారుస్తున్నారని, అంబేద్కర్‌ను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని ఆరోపించారు. ఆయన మరణానంతరం ఢిల్లీలో అంతిమ సంస్కారాలు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరాకరించి ఘోరంగా అవమానించింది. చివరికి ఆయన పార్థివదేహాన్ని తరలించేందుకు విమాన ఖర్చులు కూడా తమ కుటుంబాన్నే భరించాలని అంబేద్కర్ సతీమణికి తెలిపారు. మోడీ ప్రభుత్వం అంబేద్కర్ జీవితం గడిపిన ప్రదేశాలను పంచతీర్థంగా అభివృద్ధి చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ కులగణన పేరుతో కుట్ర చేస్తోంది. తెలంగాణలో 51 శాతం బీసీలను 45 శాతంగా చూపించి, 10 శాతం ముస్లింలను బీసీల కోటాలో చేర్చి మోసం చేస్తూ దేశానికి రోల్ మోడల్ అంటూ గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను పల్లెపల్లెనా, వాడవాడలా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.

అంబేద్కర్ ఆలోచనలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ : ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్

దేశంలో ఇప్పటివరకు అంబేద్కర్​ఆలోచన ప్రకారం నడిచిన ఏకైక పార్టీ బీజేపీనేని, జనసంఘ్ కాలం నుంచే అనేక సందర్భాల్లో ఆయన భావజాలానికి అనుగుణంగా పార్టీ నడుస్తూ వచ్చిందన్నారు. దేశ విభజనకు బాబాసాహెబ్ ఘాటుగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఆర్టికల్ 370 కు వ్యతిరేకంగా గళమెత్తిన మహానుభావుడు అని, సమీకరించు - బోధించు - పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని కొనసాగించే దిశగా మనమంతా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.



Next Story

Most Viewed