- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మనీలాండరింగ్ కేసులో చంచల్‌గూడ జైలుకు సుఖేష్ గుప్తా

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంబీఎస్ జువెల్లర్స్ అధినేత సుఖేష్ గుప్తాకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ వెంటనే ఈడీ సిబ్బంది ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించింది. వచ్చే నెల 5వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగనున్నది. మనీలాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. వరుసగా రెండు రోజుల పాటు ఎంబీఎస్ జువెల్లర్స్ తోపాటు ముసద్దీలాల్ జువెల్లర్స్ షోరూమ్‌లలో ఈడీ బృందాలు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల్లో సోదాలు జరిపి సుమారు రూ. 100 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను, రూ. 50 కోట్ల విలువైన వజ్రాభరణాలను, బినామీ రూపంలో ఉన్న మరో రూ. 50 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. సుఖేష్ గుప్తాను మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. బుధవారం ఉదయం ఈడీ కోర్టులో హాజరుపర్చడంతో జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ అనే ప్రభుత్వరంగ సంస్థ నుంచి ఎంబీఎస్ జువెల్లర్స్ గతంలో భారీ స్థాయిలో బంగారం కొనుగోలు చేసిందని, దానిని పూర్తిగా విక్రయించినా చెల్లింపులు చేయలేదని సీబీఐకు ఫిర్యాదు చేసింది. దానిని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన తర్వాత భారీ స్థాయిలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని గుర్తించి మనీ లాండరింగ్ చోటు చేసుకున్నట్లు పేర్కొని తదుపరి విచారణ కోసం ఈడీకి సమాచారం ఇచ్చింది. దాని ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ బృందాలు గతేడాది సైతం సోదాలు చేసి రూ. 326 కోట్ల మేర ఆస్తుల్ని జప్తు చేసింది. ఎంఎంటీసీకి చెల్లించాల్సిన అసలుతోపాటు వడ్డీ కూడా కలిపి మొత్తం రూ. 503 కోట్లకు చేరడంతో షోరూమ్‌లను ఈడీ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న బంగారు, వజ్రాభరణాలను కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రెజరీలో భద్రపరిచింది.
సుఖేశ్ గుప్తాను అరెస్టు చేసిన అనంతరం ఆయన నుంచి ఈడీ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సీసీఎస్ కార్యాలయంలో ఉంచి కింగ్‌కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపర్చారు. నోట్ల రద్దు సమయంలో పాత నోట్లను కొత్త నోట్లలోకి మార్చుకోడానికి బంగారాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారీ స్థాయిలో విక్రయించినట్లు రికార్డులు సృష్టించి సుమారు రూ. 110 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత జీఎస్టీ ఎగవేతకు సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మనీ లాండరింగ్‌తో పాటు 'ఫెమా' కేసును కూడా ఈడీ నమోదు చేసింది.