- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మొయినాబాద్ ఫామ్ హౌజ్ నిందితులకు 14 రోజుల రిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంలో ముగ్గురు నిందితులకు సరూర్‌నగర్ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నవంబరు 11వ తేదీ వరకు వారికి రిమాండ్ ఇస్తున్నట్లు జడ్జి ఆదేశించారు. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల రిక్వెస్టును తిరస్కరించారు. వచ్చే నెల 4వ తేదీ వరకు తదుపరి దర్యాప్తు వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నందున పోలీసు కస్టడీ ఇవ్వడం లీగల్‌గా సాధ్యం కాదని జడ్జి స్పష్టం చేశారు. ఫామ్ హౌజ్ వ్యవహారంలో ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజీ, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను నిందితులుగా పేర్కొన్న పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేసి మొయినాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి రాత్రి ఏసీబీ జడ్జి నివాసంలో వారిని హాజరు పరిచారు.
సుమారు రెండు గంటల పాటు జరిగిన విచారణ సందర్భంగా నిందితుల తరఫున న్యాయవాది వాదిస్తూ నందకుమార్ మినహా మిగిలిన ఇద్దరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వారికి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, 'ఏ క్లాస్' వసతిని ఏర్పాటు చేయాలని జడ్జికి విజ్ఞప్తి చేశారు. రామచంద్ర భారతికి ఒకటే కిడ్నీ ఉన్నదని, లుకేమియా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, వారి కుటుంబ సభ్యులకు కూడా అరెస్టు విషయం తెలియదని, కార్పొరేట్ లేదా ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి అక్కడే ట్రీట్‌మెంట్ జరిగేలా చూడాలని న్యాయవాది కోరారు. సింహయాజీ హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్నారని, గుండెలో బ్లాకులు కూడా ఉన్నాయని, ఈ కారణంగా ఆయనకు కూడా ప్రత్యేక మెడికల్ సౌకర్యాన్ని జైల్లో ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జడ్జి సోమవారం వీటిని పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు న్యాయవాది ఐ.రామారావు మీడియాకు వివరించారు. తదుపరి విచారణను సోమవారానికి జడ్జి వాయిదా వేశారు. మరోవైపు వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో రామారావు జోక్యం చేసుకుని అనారోగ్య సమస్యలు ఉన్నందున ఇద్దరిని మినహాయించాలని కోరినట్లు తెలిపారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై కూడా సోమవారం విచారణ జరగనున్నది.
గతంలో ఇదే ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్‌కు నిరాకరించింది. వీరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం కేసు నమోదు చేసినా తగిన ప్రొసీజర్ పాటించలేదని పోలీసులపై అసహనం వ్యక్తం చేసి ఫామ్ హౌజ్‌లో ఎంత డబ్బు దొరికిందో లేదా ఏ మేరకు ఆర్థిక ప్రభావం ఉన్నదో రిపోర్టులో పేర్కొనలేదని వ్యాఖ్యానించి రిమాండ్‌కు నిరాకరించింది. ఏసీబీ యాక్టులోని సెక్షన్ 8 వీరికి వర్తించదని స్పష్టం చేసింది. కానీ ఈ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు రివిజిన్ పిటిషన్ వేయడంతో వీరిని అదుపులోకి తీసుకోవాలని, ఏసీబీ కోర్టులో హాజరు పర్చాలని పోలీసులను ఆదేశించింది. ఇంకోవైపు ముగ్గురు నిందితులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎదుట హాజరుకావాలని, లేనిపక్షంలో పోలీసులు అరెస్టు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఏసీబీ కోర్టు సైతం వీరికి రిమాండ్ విధించాలని ఆదేశించింది.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం మధ్యాహ్నమే అరెస్టు చేసి మొయినాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి మరోమారు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. చేవెళ్ళ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఏసీబీ కోర్టు జడ్జి నివాసంలో హాజరు పరిచారు. నవంబరు 11వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండులో భాగంగా జైల్లో ఉండనున్నారు.