- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చందానగర్ సర్కిల్ పరిధిలో చెత్త ఆటోలు మిస్సింగ్.. పోలీసులకు ఫిర్యాదు

దిశ, శేరిలింగంపల్లి: చందానగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని ఏఎంహెచ్ సెక్షన్‌లో దొంగలు పడ్డారు. స్వచ్ హైదరాబాద్, స్వచ్ శేరిలింగంపల్లిలో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు గాను పెద్ద ఎత్తున ఆటోలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో 32 ఆటోలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ఇతర అధికారులు. శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఇది వరకు ఇదే తరహాలో స్వచ్ ఆటోలను అధికారులు పంపిణీ చేశారు. వారికి కేటాయించిన ఏరియాలో ఇంటింటికి చెత్తను సేకరించాల్సి ఉంటుంది.
ఇందుకుగాను ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ.100 ను తీసుకుంటారు. ఈ విధంగా వారికి ఆదాయం చేకూరుతుంది. అయితే ఇలా కేటాయించిన ఆటోల్లో కొన్ని మాయమయ్యాయి. చెత్త సేకరించేందుకు ఇచ్చిన ఆటోలను తీసుకుని కొంతమంది లబ్ధిదారులు హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు. చెత్త ఆటోలను ఇచ్చిన కొంత కాలానికే పనిని వదిలేసి ఆటోలను తీసుకుని మరీ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఇలా ఒకరో ఇద్దరు కాదు చందానగర్ సర్కిల్ పరిధిలోనే ఆరుగురు లబ్ధిదారులు ఇలా ఆటోలతో ఉడాయించారు.
ఇలా బయటకు వచ్చింది..
లబ్ధిదారులకు కేటాయించిన ఆటోలు ఏ ప్రాంతాల్లో చెత్త సేకరిస్తున్నాయి అనేది స్థానిక ఎస్సార్పీలు పర్యవేక్షిస్తుంటారు. వారిపై ఎస్ ఎస్ వీటిని చూస్తుంటారు. వీటన్నింటినీ ఏఎంహెచ్‌ఓ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా రోజుల తర్వాత ఇటీవల చందానగర్ పీజేఆర్ స్టేడియంలో వెరీఫికేషన్ చేస్తుండగా ఆటోలు మిస్సింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో లోలోపల దర్యాప్తు చేసిన అధికారులు ఎట్టకేలకు ఆరు ఆటోల యజమానులు పనులు చేయడం లేదని, వాటిని తీసుకుని కర్నూల్ వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీనిపై బుధవారం చందానగర్ ఏఎంహెచ్‌ఓ డాక్టర్ కార్తీక్ చందానగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఆటోల మిస్సింగ్ పై అనేక అనుమానాలు..
చందానగర్ సర్కిల్ పరిధిలో చెత్త సేకరించే ఆరు ఆటోలు కనిపించకుండా పోవడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆటోల లబ్ధిదారులు చెత్త సేకరించకుండా వెళ్లిపోతే ఇన్నాళ్లు వాళ్లకు కేటాయించిన ఏరియాల్లో చెత్త సేకరణ ఎలా జరిగింది. ఇన్నాళ్లు అక్కడ ఎలా మేనేజ్ చేశారు. కింది స్థాయి అధికారులకు ఈ విషయం ముందే తెలుసా..? అన్నీ తెలిసే ఈ ఆటోల మిస్సింగ్ అయినా ఊరుకున్నారా..? లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకునే వారు పని చేయకుండా వెళ్ళిపోయినా ఎలాంటి ఫిర్యాదు చేయలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే మరో నాలుగు ఆటోలు కూడా గత మూడు, నాలుగు రోజులుగా అసలు స్టార్ట్ చేయలేదని, అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.