రోస్ట్ అండ్ టోస్ట్ బార్ అండ్ లాంజ్ లో మైనర్ బాలిక డ్యాన్స్..

by Disha Web Desk 16 |
రోస్ట్ అండ్ టోస్ట్ బార్ అండ్ లాంజ్ లో మైనర్ బాలిక డ్యాన్స్..
X

దిశ, శేరిలింగంపల్లి : ఎన్ని ఘటనలు జరిగినా, పోలీసులు ఎన్ని దాడులు చేసినా నగరంలో పబ్ ల యజమానులు వీ డోంట్ కేర్ అంటున్నారు. స్వయంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పబ్ ల యజమానులను పిలిచి మీటింగ్ పెట్టి మరీ హెచ్చరించినా తాము మాత్రం మారేది లేదంటున్నారు కొందరు పబ్ నిర్వాహకులు. మైనర్లకు పబ్ ల్లోకి అనుమతులు లేవని ఓ వైపు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నిర్వాహకులు మాత్రం యథేచ్ఛగా అనుమతులు ఇస్తున్నారు. మైనర్లను లోపలికి అనుమతించడమే కాదు వాపు ఫ్లోర్ పై చిందులు వేస్తున్నా.. పోనీలే చిన్న పిల్లలని లైట్ తీసుకుంటున్నారు. అమ్నెషియా ఘటన తర్వాత నాలుగు రోజులు హడావుడి చేసిన అన్ని శాఖలు ఎప్పటిలాగే మిన్నకుండి పోయాయి. దీంతో పబ్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు.

వరుస ఘటనలు..

గతంలో గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ పబ్ లో మైనర్ బాలిక డ్యాన్స్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై ఆయా శాఖల అధికారులు తెగ హడావుడి చేశారు. తర్వాత అంతా కామన్. ప్రస్తుతం మరోసారి అలాంటి ఘటననే మదీనగూడ లోని మరో లాంజ్ అండ్ బార్ లో చోటుచేసుకున్న ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదీనగూడలో రోస్ట్ అండ్ టోస్ట్ పేరుతో లాంజ్ అండ్ బార్ కొనసాగుతుంది. ఇందులోకి వెళ్లేందుకు మామూలు రోజుల్లో ఎలాంటి ఫీజు లేకున్నా, వీకెండ్స్ లో మాత్రం ఒక్కో పర్సన్ రూ. 1000 చెల్లించి ఎంట్రీ కావాల్సి ఉంటుంది.

అలా వెళ్లేందుకు చాలామంది మొగ్గుచూపుతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఓ కుటుంబం ఫ్యామిలీతో పాటు ఈ లాంజ్ అండ్ బార్ కు వెళ్లారు. అందులో ఇద్దరు మైనర్ అమ్మాయిలే ఉండడం, వారిని లోపలికి అనుమతించడం చకచకా జరిగిపోయాయి. అక్కడ పుష్ప సినిమా సాంగ్ ప్లే అవగానే అందులోని 8 ఏళ్ల చిన్నారి డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కేసి చిందులు వేసింది. దీంతో అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర పోలీసు అధికారులకు కూడా ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పబ్ లు, లాంజ్ ల యజమానులతో మీటింగ్ పెట్టి హెచ్చరించిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.


Next Story

Most Viewed