హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-04-15 16:47:57.0  )
హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల "గ్రేడ్- ఏ" కమర్షియల్ స్పేస్‌ను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్​గచ్చిబౌళి నానక్ రాంగూడలో యూఎస్‌కు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్"ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్ "గ్లోబల్ బిజినెస్ హబ్" గా మారిందని అందుకు అనుగుణంగానే కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరిగిందన్నారు. ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ తగ్గుతుంటే మన దగ్గర గతేడాది దేశంలోనే అత్యధికంగా 56 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదయ్యిందన్నారు. గతేడాది రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్పేస్‌ను వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఆమ్జెన్, గ్లోబల్ లాజిక్, ఎలీ లిల్లీ, మారియంట్, సిగ్నా లాంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన 355 జీసీసీలుండగా 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయన్నారు. ఏడాది వ్యవధిలో 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయన్నారు. హైదరాబాద్ ను జీసీసీలకు హబ్‌గా మార్చడమే కాకుండా వాటిని ఇన్నోవేషన్, ఆర్అండ్ డీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ తదితర అంశాల్లో సేవలు అందించే గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. కొందరు కావాలనే పనిగట్టుకొని పెట్టుబడులు రాకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ జీసీసీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వేయి మంది ఐటీ, డేటా నిపుణులకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రెండు, మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, సెక్యూరిటీ మైకెల్, కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మాడి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed