చీటింగ్ కేసులో వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు

by Disha Web Desk 15 |
చీటింగ్ కేసులో వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు
X

దిశ, ముషీరాబాద్ : బంగారు ఆభరణాలను విక్రయిస్తానని నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది. నారాయణగూడ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి... రాజస్థాన్ జై నారాయణ్ వ్యాస్ కాలనీ బికనీర్ ప్రాంతానికి చెందిన రాజ్ లక్ష్మీ జ్యువెలర్స్ యజమాని భాను ప్రకాష్ సోని బంగారు ఆభరణాలను పలు రాష్ట్రాల్లో తిరుగుతూ బంగారు దుకాణాల్లో విక్రయిస్తుంటాడు. అలాగే హైదరాబాద్ బషీర్ బాగ్ కు చెందిన ముకేష్ చంద్ సరఫ్ ( 47 ) ప్యాట్నీ సికింద్రాబాద్‌లోని ఎంబీఎస్ షోరూమ్‌లో పని చేసే వాడు. అతన్ని 2014లో భాను ప్రకాష్ సోని కలిసాడు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను విక్రయించాలని కోరగా ముకేష్ చంద్ తనకు నగరంలో చాలా బంగారు దుకాణ యజమానులతో సంబంధాలున్నాయని, తనకు ఇస్తే అమ్మిపెడుతానని నమ్మబలికాడు.

అది నమ్మిన భాను ప్రకాష్ సోని బంగారు ఆభరణాలను ఇచ్చాడు. దాంతో విక్రయించాక ఆరు లక్షల 35 వేల రూపాయలను పది రోజుల్లో ఇస్తా అని చెప్పిన ముకేష్ చంద్ ముఖం చాటేశాడు. దీంతో భాను ప్రకాష్ సోని 2014 ఆగస్టు 12వ తేదీన ముకేష్ చంద్ ఇంటికి వెళ్లి డబ్బులు అడుగగా తీవ్ర స్థాయిలో దూర్భాషలాడటంతో పాటు ఏమి చేసుకుంటావో చేసుకో అని బెదిరించాడు. దాంతో బాధితుడు భానుప్రకాష్ ముఖేష్ పై కేసు నమోదు చేసాడు. అనంతరం లక్షా 75 వేల రూపాయలను ఇస్తాను కేసును ఉపసంహరించుకోవాలని భాను ప్రకాష్ ను ముఖేష్ చంద్ కోరాడు. సరే అని ఒప్పుకున్న భాను ప్రకాష్ కు ముకేష్ చంద్ చెక్కు ఇచ్చాడు. చెక్కును తీసుకెళ్లి డ్రా చేసుకుందామని భాను ప్రకాష్ బ్యాంకుకు వెళ్లాడు. చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు లోక్ అదాలత్ ను సంప్రదించాడు. ఉద్దేశ పూర్వకంగానే ముకేష్ చంద్ మోసం చేశాడని అతని పై 120 బి, 406, 420, సెక్షన్లను నమోదు చేసిన కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఎ1 కు మద్దతుగా ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed