- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సలహాదారు కావలెను..!? పార్టీల టికెట్లు ఆశిస్తున్న నాయకుల కొత్త ట్రెండ్..

దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, మధ్యలో కాంగ్రెస్ మేమంటే మేమంటూ అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడుతున్నాయి. ఏ పార్టీకి ఆపార్టీ గెలుపుపై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్రంలో మునుగోడు ఎలక్షన్స్‌ను సెమీఫైనల్ గా భావిస్తూ అన్ని పార్టీలు అక్కడే ఫోకస్ చేస్తున్నాయి. అదీగాక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. దీంతో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు ఆశావాహులు తెరమీదకు వస్తున్నారు. కొన్ని చోట్ల ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది.
ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నా లీడర్లు ఇప్పటి నుండే పక్కా ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి స్టెప్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది. ఎవరు మనకు సహకరిస్తారు. ఎవరు సహకరించరు ఇలా అనేక రకాలుగా అనుకూల, ప్రతికూల అంచనాలతో ముందుకు వెళుతున్నారు. ఇక ఎన్నికల బరిలో ఉండటం ఖాయం అనుకునే నాయకులు మరో అడుగు ముందుకేసి సలహాదారులు, పీఆర్ఓ లను అపాయింట్మెంట్ చేసుకుంటూ తాము చేసే ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా చూసుకుంటున్నారు.
సలహాదారులకు ఫుల్ డిమాండ్..
ఎన్నికలపై అవగాహన, ప్రజల నాడి పట్టడంలో నేర్పు, ప్రజలకు నాయకులపై ఉన్న మంచి అభిప్రాయాన్ని ఓట్లుగా మలచడం, ప్రజల్లోకి ఎప్పుడు ఎలా వెళ్లాలి, ఏం చేస్తే మన వైపు జనాలు ఆకర్షితులు అవుతారు. లీడర్ల హ్యాండ్ ఇవ్వకుండా మేనేజ్ చేయడం ఎలా అన్న విషయాలు తెలిసిన వారిని రాజకీయ నాయకులు, ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులు తమ సలహాదారులుగా నియమించుకునే పనిలో పడ్డారు.
ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు సలహాదారులను నియమించుకోగా.. ఇంకొందరు సరైన సలహాదారుల కోసం వేచి చూస్తున్నారు. వీరికి వేతనాలు కూడా భారీగా చెల్లించేందుకు వెనుకాడటం లేదు. వీరు చేయాల్సిందల్లా ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న నాయకుడు ఎప్పుడు ఏం చేయాలి, జనాలను తమ వైపు తిప్పుకోవడం ఎలా, ఏది నాయకుడికి ప్లస్, ఏది మైనస్ అవుతుంది అనేది ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తూ లీడర్ కు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది.
ప్రచారం కోసం తహతహ..
రాజకీయ నాయకులు ఎంతగా ప్రచారం చేసుకుంటే అంత ప్రయోజనం అనేది వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకోసమే ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజల దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఎన్నికల సమయంలో ఇస్త్రీలు చేయడం, హోటల్ లో టీ పోయడం, పసి పిల్లలను ఎత్తుకుని ముసిముసి నవ్వులు నవ్వడం, వృద్ధుల వద్ద వంగి వంగి నమస్కారం చేయడం. ఇలా చిత్ర విచిత్రమైన స్టంట్ లు చూస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ ప్రజల్లోకి వెలితేనే వారికి గుర్తింపు దక్కుతుంది.
సరిగ్గా ఇలాంటి వాటి కోసం, తాము చేసే పనులను, మంచి కార్యక్రమాలను జనాల నోట్లో నానేలా వడ్డి వారించేందుకు పీఆర్ ఓలను నియమించుకుంటున్నారు పొలిటీషియన్స్. ఒక్కో లీడర్ దగ్గర ఇప్పుడు ఇద్దరిద్దరు పీఆర్ఓ లు ఫుల్ టైమ్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నారు. తమ లీడర్ చేసే ప్రతి పనిని మీడియాకు బ్రీఫ్ చేస్తూ, వాటికి సంబంధించిన కటింగ్స్, వీడియోస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ లీడర్లకు ప్రచారం కల్పిస్తున్నారు.
స్పీడ్ పెంచిన నాయకులు..
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ టికెట్లు ఆశిస్తున్న నాయకులు ప్రతి డివిజన్ లోనూ పర్యటిస్తున్నారు. అక్కడ సమస్యలు తెలుసుకుంటూ వాటిని జనాల్లోకి తీసుకు వెళుతున్నారు. ఇలా అయినా పార్టీ పెద్దల దృష్టిలో పడితే తమకు తగిన గుర్తింపు ఉంటుందని, టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తుందన్న ఆశతో ఖర్చుకు వెనుకాడకుండా ముందుకు వెళుతున్నారు. మొత్తానికి నాయకులు టికెట్ ఆశతో చేస్తున్న ఈ హడావుడి ఎంత వరకు వస్తుందో చూడాలి.