జహీరాబాద్ ఎంపీకి 'సుప్రీం'లో చుక్కెదురు

by Dishanational1 |
జహీరాబాద్ ఎంపీకి సుప్రీంలో చుక్కెదురు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జహీరాబాద్ లోక్‌సభ సభ్యుడు బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన ఎన్నికపై తెలంగాణ హైకోర్టు మరోసారి పరిశీలన చేయాలని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టాలని స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌తోపాటు పిటిషనర్ మదన్ మోహన్ రావు కూడా అక్టోబరు 19న తెలంగాణ హైకోర్టు సీజే ముందు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల లోతుల్లోకి వెళ్ళదల్చుకోలేదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పును పునఃపరిశీలించాల్సిన ఆవశ్యకత ఉన్నదని స్పష్టం చేసింది. పాటిల్‌తోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మదన్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా పై ఉత్తర్వులు జారీ చేసింది.

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికను సవాలు చేస్తూ మదన్ మోహన్ రావు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు జూన్ 15న తోసిపుచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం పొందుపర్చారని, కొన్ని కేసులను ప్రస్తావించలేదని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన జస్టిస్ అభిషేక్‌రెడ్డి ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం పిటిషన్‌ను తోసిపుచ్చారు. దీన్ని సవాలు చేస్తూ మదన్‌మోహన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో ఇరు పక్షాల తరఫున తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు గతంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పలు కేసులను పరిశీలించింది.

బీబీ పాటిల్ తరఫునగానీ, పిటిషనర్ తరఫునగానీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ వెలువరించిన ఉత్తర్వుల ప్రతులను పొందుపర్చలేదని, ఇప్పటికీ హైకోర్టు వెబ్‌సైటులో ఆ ఉత్తర్వులు అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి బెంచ్ వెలువరించిన ఉత్తర్వులను పరిశీలించకుండా ఆ తీర్పుపై ఎలాంటి కామెంట్ చేయలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ విజ్ఞప్తిలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని దీన్ని పునఃపరిశీలించాల్సిందిగా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఆదేశించింది. ఎంపీ బీబీ పాటిల్, పిటిషనర్ మదన్‌మోహన్ రావు అక్టోబరు 10న తెలంగాణ హైకోర్టు సీజే ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.



Next Story

Most Viewed