తదుపరి గురి ఎవరిపై?

by S Gopi |   ( Updated:2022-10-15 23:30:47.0  )
తదుపరి గురి ఎవరిపై?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన బోయిన్‌పల్లి అభిషేక్ ఐదు రోజుల సీబీఐ కస్టడీ శనివారంతో ముగిసింది. అనంతరం ఆయనను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ పోలీసులు హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయనను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఈ స్కామ్‌లో 15వ నిందితుడిగా ఉన్న రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ అరుణ్ రామచంద్రన్ పిళ్ళైకు నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ పోలీసులు కోర్టుకు వివరించారు. కుటుంబపరమైన కొన్ని కారణాలతో వెంటనే హాజరుకాలేనంటూ పిళ్ళై బదులిచ్చారు. సీబీఐ ఎన్ని రోజులు వెయిట్ చేస్తుంది, ఎప్పుడు అదుపులోకి తీసుకుంటుంది, అరెస్టు చేస్తుందా, కస్టడీకి కూడా తీసుకుంటుందా.. ఇలాంటి చర్చలు మొదలయ్యాయి. స్కామ్ దర్యాప్తులో భాగంగా పిళ్ళైతో పాటు ఇంకెవరిపై సీబీఐ గురిపెట్టిందనే గుబులు కూడా కొద్దిమందిలో మొదలైంది.

విచారణ సందర్భంగా కీలకమైన ఆధారాలను చూపించినా అభిషేక్ పెదవి విప్పలేదని, వివరాలను వెల్లడించడానికి సహకరించలేదనే కారణంతో ఆయనను సీబీఐ ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నది. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి వివరాలను వెల్లడించారో, దాని తదుపరి చర్యలు ఏ రూపంలో ఉండనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్‌తో తెలంగాణలోని పలువురు వ్యాపారవేత్తలు, అధికార పార్టీ నేతలకు సంబంధాలున్నాయని ఈడీ అనుమానిస్తున్నది. సోదాలు చేసి డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాలు, ముడుపుల బదిలీ తదితరాలపై ప్రాథమికంగా వివరాలను సేకరించింది. వాటి ఆధారంగా సీబీఐ ఇప్పుడు ఎలాంటి యాక్షన్ చేపడుతుందనేదే ప్రధాన చర్చగా మారింది.

ఇదే కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్‌ను సీబీఐ విచారించింది. బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అమిత్ అరోరాను కూడా ప్రశ్నించింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ ద్వారా లబ్ధి పొందడానికి వివిధ లిక్కర్ ట్రేడర్లు, ఇతర వ్యాపారాలు చేసే బిజినెస్ వ్యక్తులు భాగస్వాములుగా మారినట్లు సీబీఐ గుర్తించింది. అలాంటి వ్యక్తుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. విజయ్ నాయర్, అభిషేక్ తదితరులను అరెస్టు చేసింది. లెక్కల్లోకి రాని డబ్బును వివిధ కంపెనీల నుంచి ముడుపులుగా బదిలీ చేసిందన్న అనుమానంతో ఈడీ సాయాన్ని కోరింది. తెలంగాణలో పలు కంపెనీలపై సోదాలు జరిగాయి. పలు ఆధారాలను సేకరించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ తన దర్యాప్తు ప్రక్రియను ముమ్మరం చేసింది. అభిషేక్ ఈ ఐదు రోజుల కస్టడీలో వెల్లడించిన వివరాల మేరకు సీబీఐ తదుపరి ఎవరిని ప్రశ్నించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నది.

Next Story

Most Viewed