జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి: మహేష్

by Dishanational1 |
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి: మహేష్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నియామకం చేయబడి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పని చేసిన ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అద్యక్షుడు మహేశ్ శుక్రవారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అతిపెద్ద పోస్టుల భర్తీ ప్రక్రియ పంచాయతీ కార్యదర్శుల నియామకం అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం జరిగి 2023 ఏప్రిల్ 11వ తేదీకి నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ ముగుస్తున్నప్పటికీ వారి రెగ్యులరైజేషన్ జరుగకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 26 ప్రకారం వారిని ఏప్రిల్ 12వ తారీకు నుండి రెగ్యులర్ ఉద్యోగస్తులుగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక ఉద్యోగి రెగ్యులరైజేషన్ కావాలంటే వారి ప్రొబేషన్ కాలంలో వారి ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని అలాగే వారిపై ఏమైనా కేసులు ఉన్నాయా లేవా అలాంటి ఎంక్వయిరీలు కంప్లీట్ చేసుకుని అభ్యర్థిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగిగా నియామకం చేస్తారని చెప్పారు. ఈ ప్రక్రియ అంతటికీ కనీసం ఆరు నెలల కాలం పడుతుండగా వారి ప్రొబేషనరీ పీరియడ్ ముగియడానికి ఇంకా 120 రోజులు కూడా లేదన్నవిషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, వారి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించేలా ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని కోరారు. అంతేకాకుండా గత రెండు సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రజలకు సేవలు అందించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సేవలను కూడా క్రమబద్ధీకరించాలని, వారి సేవలను రెగ్యులర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మారే విధంగా తగిన నిబంధనలు రూపొందిస్తూ ఆదేశాలు జారీ చేయాలని మహేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Also Read....

'లిక్కర్ డాన్ హటావో తెలంగాణ బచావో'.. ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్


Next Story

Most Viewed