విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు

by Taduka Kalyani |

విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి బాధితుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు
X

దిశ, చైతన్యపురి : విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి బాధితుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో నివాసం ఉండే ఎన్. సుజాత కు తనకు తెలిసిన వ్యక్తి ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాలు, వీసా ప్రక్రియ సేవలందించే సరస్వతి హరీష్ రాజు, నాగేందర్, నరేందర్ అనే వ్యక్తులు పరిచయమయ్యారు. విదేశాలలో ఉద్యోగాలు, చెల్లుబాటయ్యే వీసాలు, వర్క్ పర్మిట్‌లను 2 నుండి 3 నెలల్లోనే ఇప్పిస్తామని సుజాతకు తెలిపారు. సుజాత కార్యాలయానికి వచ్చి ఆమెతో నమ్మకం కలిగేలా మాట్లాడారు. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టు 23న హరీష్ రాజు, నాగేందర్, నరేందర్ ల యొక్క క్వెస్ట్ బిజినెస్ టెక్ (క్యూబిటి) ఖాతాకు సుజాతకు చెందిన సెకండ్ మినిట్ ఓవర్సీస్ వీసా ప్రాసెసింగ్ కార్యాలయంలో ఒప్పందం చేసుకుని డాక్యుమెంటేషన్, జీఎస్టీ ఫైల్ నిర్వహణ ఛార్జీల వంటి వివిధ కారణాలు చెప్పి అదేరోజు ఒక లక్ష రూపాయలు సుజాత అకౌంట్ నుండి వారి కంపెనీ అకౌంటుకు, హరీష్ రాజ్ అకౌంటు కు బదిలీ చేయించుకున్నారు. వారిని నమ్మి, చెక్ రిపబ్లిక్, జర్మనీ వంటి దేశాలలో అవకాశాల కొరకు 31 మంది అభ్యర్థుల దరఖాస్తుల ప్రాసెస్ కోసం సుజాత క్వెస్ట్ బిజినెస్ టెక్ అకౌంటుకు, ఐటీ కారణాల చేత వ్యక్తిగత ఖాతాలకు మొత్తం రూ. 39,00,000/- చెల్లించారు. ఆ తర్వాత అనేక వీసా దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. విషయాన్నీ సుజాత పరిశీలించగా హరీష్ రాజు, నాగేందర్, నరేందర్ లు సమర్పించిన వర్క్ పర్మిట్లు, ఎంబసీకి సంబంధించిన పత్రాలు నకిలీవని, మోసపూరితమైనవని సుజాత గుర్తించింది. సుజాత డబ్బు తిరిగి ఇవ్వమని పై ముగ్గురిని అడిగినప్పుడు వారు నిరాకరించడమే కాకుండా అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగింది.

అంతేకాకుండా తమ అనుచరులతో కలిసి సుజాతను దూషించి భయబ్రాంతులకు గురిచేసి వేధించారు. సుజాత కార్యాలయానికి వచ్చి గొడవ సృష్టించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. పైన పేర్కొన్న నిందితుల చర్యల వల్ల తనకు ఆర్థిక, పరువు నష్టం, మానసిక వేధింపులు, వ్యాపార నష్టం వాటిల్లాయని సుజాత చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఈ నెల 6 న ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పై ఫిర్యాదులోని విషయాల ఆధారంగా నిందితులు హరీష్ రాజు, నాగేందర్, నరేందర్ ల పై క్రైమ్ నెం. 623/2026 U/s 318 (4), 329 (4), 351 (2), 352 BNS, ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈకేసులో పోలీసులు దర్యాప్తు చేయగా ముగ్గురు నిందితులు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు, వీసాలు త్వరగా ఏర్పాటు చేస్తామని పలువురు అభ్యర్థుల నుండి దరఖాస్తులను సుజాత ద్వారా నిందితుల కంపెనీ, వారి వ్యక్తిగత ఖాతాలకు పెద్ద మొత్తంలో నిందితులు డబ్బులు వసూలు చేసి వారికి ఎటువంటి విదేశీ ఉద్యోగ అవకాశాలు, వీసా ప్రక్రియలు ఏర్పాటు చేయకుండా మోసము చేసినట్లు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా ఇరుపార్టీలు పోలీస్ స్టేషన్ కు రాగా, నాగేందర్, నరేందర్ ల తరుపున వచ్చిన పెద్దమనిషి మేము పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని ఎల్బినగర్ లోని ఏసీపీ కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ఆ తరువాత ఎస్సై వెంకటయ్య కూడా వచ్చి కేసు విషయం తెలుసుకొని మహిళకు న్యాయం చేయాలని ఇరుపార్టీలను బయట మాట్లాడుకోవాలని సూచించారు. అదేరోజు కేసు దర్యాప్తులో బాగంగా నిందితులైన దారపురెడ్డి నాగేందర్, పల్లం నరేందర్ వారికి నోటిస్ U/s 35 (3) BNSS ఇచ్చి పంపించారు. కానీ పోలీస్ స్టేషన్ లో ఎలాంటి డబ్బుల స్వయిపింగ్, లావాదేవీలు జరగలేదని చైతన్యపురి సీఐ కె. సైదులు తెలిపారు.

Next Story