- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్రూపులు, వర్గాలు వద్దు.. కలిసి పనిచేద్దాం... పనులు, కాంట్రాక్టులుంటే చెప్పండి: ఎమ్మెల్యేలతో కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: పంతాలు పట్టింపులు వద్దని కేటీఆర్ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. పార్టీలో కలిసి మెలిసి పనిచేద్దామని, గ్రూపు తగాదాలు వద్దని, దీన్ని వల్ల అందరికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలో ఏమైనా పనులు, సమస్యలు ఉంటే తనకు నేరుగా చెప్పాలని కోరుతున్నారు. ఆర్థికపరమైన అంశాలు ఉన్నా సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరిస్తున్నారు. చాలా జిల్లాల్లో టీఆర్ఎస్ నేతల్లో గ్రూపులు, వర్గపోరు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల గ్రూపు తగాదాలు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. పోటీగా మీడియా సమావేశాలు పెట్టి పరస్పరం తిట్టుకున్న లీడర్లు ఉన్నారు. ఇప్పట్నించే వీటిని తగ్గించకపోతే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత పెరిగే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ జిల్లాల వారీగా లీడర్లతో మాట్లాడాలని సూచించడంతో కేటీఆర్ ఆపనిలో పడ్డారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి పార్టీ పరిస్థితులను ఆరా తీస్తున్నారు. పనిలో పనిగా సొంత నియోజకవర్గంలో పార్టీపరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీలో సమన్వయంతో పనిచేయాలని, గ్రూపు తగాదాలు వద్దని వారించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏం పనులు కావాలో చెప్పండి
నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు తనకు చెప్పాలని కేటీఆర్ ఎమ్మెల్యేలను అడిగినట్టు తెలిసింది. సెగ్మంట్ లో పెండింగ్ పనులు, సీసీ రోడ్లు, కాంట్రాక్టులు ఏం కావాలో తనకు చెప్తే సాయం చేస్తానని సూచించినట్టు సమాచారం. దీంతో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వెంటనే చెప్పడంతో, ఆ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత శాఖ మంత్రులకు అప్పగించినట్టు తెలిసింది. నేరుగా ఓటర్లకు లబ్ది చేకూర్చే సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణలక్ష్మీ సరిగ్గా రావడం లేదని కొందరు ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తెస్తే, వాటిని రెగ్యులర్ గా ఇచ్చే విధంగా చూస్తానని హామి ఇచ్చినట్టు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులు చేసిన కాంట్రాక్టులకు బిల్లులు రావడం లేదని విషయాన్ని గుర్తు చేస్తే, తర్వలో బిల్లులు చెల్లింపు క్లియర్ అవుతాయని చెప్పినట్టు తెలిసింది.
గ్రూపులు కడితే అందరికి నష్టం..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం జరిగితే వచ్చే ఏడాది చివర్లో జరుగుతాయి. ఒకవేళ మునుగోడు ఎన్నికల తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని ప్రచారం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచేందుకు కేసీఆర్ ఇప్పట్నించే కసరత్తు ప్రారంభించారు. ముందుగా పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు తగ్గించే పనిని కేటీఆర్ కు అప్పగించారు. గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల లీడర్లతో ముందుగా మాట్లాడుతున్నట్టు తెలిసింది. వర్గ పోరు వల్ల పార్టీతోపాటు లీడర్లకు కూడా నష్టమని వివరిస్తున్నట్టు సమాచారం. తాజాగా స్టేషన్ గన్ పూర్ నియోజవర్గంలో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు రాజయ్య, కడియం మధ్య జరిగిన వివాదంతో ఎలాంటి నష్టం వాటిల్లిందో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యేకు వివరించినట్టు తెలిసింది. ఏ కారణంతో గ్రూపు తగాదాలు వస్తున్నాయో తనకు పూర్తి సమచారాం ఉందని సదరు ఎమ్మెల్యేకు తెలిపినట్టు సమాచారం.
నెత్తికెక్కిన కళ్లు దిగాయా?
సొంత పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ అపాయింట్మెంట్ దొరికిందంటే పెద్ద అదృష్టంగా భావిస్తారు. ఆయన్ను కలిసేందుకు రోజుల కొద్దీ నిరీక్షిస్తున్నారు. ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా ప్రగతిభవన్ వెళ్లిన ఎమ్మెల్యేలను వెనక్కి పంపిన ఘటనలు అనేకం ఉన్నాయని టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు బై ఎలక్షన్ వల్ల ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్ చేసి, పార్టీ ప్రచార తీరును అడిగి తెలుసుకుంటున్నారు. కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం రోజుల కొద్దీ ప్రగతిభవన్ చుట్టూ తిరిగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనే స్వయంగా ఫోన్ చేయడంతో ''ఇంతకాలం నెత్తికెక్కిన కళ్లు ఇప్పుడు దిగయా''అని తమ సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్టు తెలిసింది. పార్టీలో సమస్యలు ముదిరిన తర్వాత ఇప్పుడు మేల్కొంటే ఏం లాభమని అభిప్రాయంలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
కేసీఆర్‌కు లేఖ రాశా... ఇప్పటివరకు స్పందన లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి