కేసీఆర్ నిరంకుశ పాలనను గద్దె దించడమే లక్ష్యం: కోదండరాం

by Vinod kumar |   ( Updated:2022-06-06 15:28:59.0  )
కేసీఆర్ నిరంకుశ పాలనను గద్దె దించడమే లక్ష్యం: కోదండరాం
X

దిశ, ముషీరాబాద్ : ఆత్మ గౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ దళారీల పాలన అంతం చేద్దామని, ఉద్యమ ఆకాంక్షను సాధించాలని అంశంపై కోదండరాం.. ఆత్మ గౌరవ దీక్ష పేరుతో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. దీక్షా శిబిరాన్ని ఆత్మ గౌరవ దీక్ష అని అన్నారు. వచ్చిన తెలంగాణ గుప్పెడు మంది పాలయిందని విమ‌ర్శించారు. నేడు ఆత్మగౌరవం ఒక వ్యక్తి, కుటుంబం చేతిలోకి వెళ్ళిందన్నారు. భవిష్యత్తు పోరాటంపై కార్యాచరణను ఖరారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

నాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు ఒక తాటి పైకి రావాల్సిన అవసరముందన్నారు. యాదగిరి గుట్ట పైకి ట్యాక్సీలు అనుమతించకుండా వారి జీవితాలు ఆగం చేస్తున్నారన్నారు. గతంలో జేఏసీ రూపంలో తెలంగాణ కోసం ఐక్యత చూపామో అదే విధంగా మనం కోరుకున్న తెలంగాణ కోసం మళ్ళీ ఐక్యత అవసరం ఉంద‌న్నారు.

ఈ దీక్షకు మద్దతుగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రం సాధించుకున్న 8 ఏళ్లకు మళ్లీ రాష్ట్ర భవిష్యత్ గురించి మాట్లాడే పరిస్థితి దాపరించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జాయింట్ యాక్షన్ కమిటీలు ఉద్యమం సమయంలో ఏర్పడ్డాయన్నారు. అవన్నీ ఇప్పుడు నిర్వీర్యం అయ్యాయని, ఇప్పుడు ఏమై పోయారు అనేది ఆలోచించుకోవాలని అన్నారు. ఆత్మగౌరవంతో బతికే ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా రాలేదన్నారు. రాష్ట్రానికి ఒక గీతం లేదన్నారు. ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదన్నారు. ఒక వ్యక్తి నేనే తెలంగాణ తెచ్చాను అనడం ఏంటి..? అని ప్రశ్నించారు. అన్నీ వర్గాల వారి పోరాటం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ఉన్న భూములు ఆక్రమణ కోసమా తెలంగాణ తెచ్చుకున్నది..? అని ప్రశ్నించారు. ఒక ఆధిపత్యం పోయి.. మరో ఆధిపత్యం వచ్చిందని తెలిపారు. కులాల వ్యవస్థ తెలంగాణ వచ్చిన తర్వాత అధికం అయ్యిందన్నారు. రైతులు తెలంగాణలో భపడుతున్న పరిస్థితి నెలకొందన్నారు.

ఇందిరాపార్కు వద్ద లక్ష మందితో అయినా సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ కావాలని.. దానికి అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా తెలంగాణ భవిష్యత్ గురించి మాట్లాడుకోవడం దురదృష్టకరమన్నారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పాలకులు ఆత్మ గౌరవాన్ని మరిచి పరిపాలిస్తున్నారన్నారు. కేంద్రం తీసుకువచ్చిన అనేక పాలసీలను కేసీఆర్ మద్దతు తెలిపారన్నారు. తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులపై హత్యలు, అకృత్యాలు పెరిగిపోయాయని, ఉద్యోగ కల్పన, దళితులకు మూడు ఎకరాలతో పాటు పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఆక్రమించారన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ పాలనపై ప్రజలు నిరాశలో, కోపంతో ఉన్నారన్నారు. ప్రశ్నించే గొంతులను జైలులో పెడుతున్నారన్నారు. హక్కుల కోసం పోరాడే పౌర హక్కులను నిషేధించడం దుర్మార్గం అని అన్నారు. విద్య, వైద్య కోసం భవిష్యత్‌లో జెఎసి ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్ష నేర‌వేర‌లేదు కాబ‌ట్టే అన్ని వ‌ర్గాల ప్రజ‌లు రోడ్ల పైకి వ‌చ్చి ఉద్యమాలు చేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఆనాటితో పోల్చుకుంటే ఈనాడే కుటుంబ పాల‌న, నియంతృత్రం, సామాజిక, రాజ‌కీయ‌ అస‌మాన‌త‌లు పెరిగాయ‌న్నారు. జెఎసి ఏర్పడిన స‌మ‌యంలో ఎమ్మార్పీఎస్ ఉంద‌ని, కేసీఆర్ దీక్ష విర‌మ‌ణ చేస్తున్న స‌మ‌యంంలో ఎమ్మార్పీఎస్ ఉంద‌న్నారు. తెలంగాణ జన సమితి హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వర్ రావు, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య, ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు ప్రభాకర్, న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, విమలక్క, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed