అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలబడిందంటే కారణం ఇదే: Kanche Ayilayya

by Dishanational1 |
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలబడిందంటే కారణం ఇదే: Kanche Ayilayya
X

దిశ, సికింద్రాబాద్: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందంటే అందుకు కారణం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమేనని రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఓయూలోని అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్, యూజీసీ డీన్ కార్యాలయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్స్ సంయుక్తంగా అంబేడ్కర్ నాడు – నేడు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు కంచ ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే మనమంతా నియంతృత్వ పాలన అనుభవించేవారమనన్నారు. భారత్ కు స్వతంత్ర్యం వచ్చే నాటికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు మతపరమైన, వామపక్ష, ఫాసిజం లాంటి మూడు రూపాల్లోని నియంతృత్వ పాలనలో ఉండేవని తెలిపారు. అంబేడ్కర్ లేకపోతే నాలుగో తరహా నియంతృత్వంలోకి భారత్ వెళ్లేదని పేర్కొన్నారు. ఆ మహనీయుని వల్లే ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్దఎత్తున ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా పగ్గాలు దక్కాయని అన్నారు. అంబేడ్కర్, ఫూలే, పెరియార్ ల రచనలను ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా చర్చా కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఓయూ వీసీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ చదవండి, రాయండి అవసరమైతే పోరాటం చేయండి అనేదే విద్యార్థులకు తాము ఇస్తున్న సందేశమన్నారు. చదవటం, రాయటం లేకుండా కేవలం పోరాటం చేయటం వల్ల ఉపయోగం ఏమిటని అయన ప్రశ్నించారు. అంబేడ్కర్ స్పూర్తితో ఓయూ చరిత్రలోనే తొలిసారిగా 50శాతం పరిపాలనా పగ్గాలను మహిళలలకు ఇచ్చామని చెప్పారు. ఉస్మానియా విద్యార్థులు పరిశోధనల్లో ముందుండాలని, ఏ విషయం పైనైనా అనుచరులుగా కాకుండా నాయకులుగా ఉండాలని సూచించారు. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడటం, చదవటం, విశ్లేషించటం, తమ దృష్టికోణంతో పరస్పరం సద్విమర్శ చేసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యార్హతలు కలిగిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ అన్నారు. అంబేద్కర్ ను ప్రతి విద్యార్థి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రసంగం విన్న తర్వాత ప్రపంచాన్ని చుట్టివచ్చినట్లు ఉందని యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైనా నేటికీ గ్రామాల్లో కాన్స్టిట్యూషన్ బదులు క్యాస్ట్ పాలన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన ప్రమాణాలు మెరుగైనంత మాత్రాన మార్పు వచ్చినట్లు కాదన్నారు. మెదళ్లలో మార్పు రావాలని హితవు పలికారు. కులం, మతం ప్రాతిపదికన చదుకున్నవాళ్లే ఎక్కువ వివక్ష పాటిస్తున్నారని అన్నారు.

అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా అనేక పరిశోధనా కార్యకలాపాలు చేపడుతున్నామని డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ వివరించారు. రాజ్యాంగం ద్వారా ఓయు హక్కు కల్పించి దేశంలో ఒక వ్యక్తి ఒకే విలువ సిద్దాంతాన్ని అంబేద్కర్ హక్కుగా ఇచ్చారని తెలిపారు. ఉస్మానియాకు త్వరలోనే అంబేద్కర్ చైర్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని అయన తెలిపారు. ఫలితంగా మరింత చురుగ్గా కార్యక్రమాలు చేపట్టవచ్చని అన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రొఫెసర్లు అడపా సత్యనారాయణ, ముసలయ్యలు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, మైనారిటీ సెల్ డైరెక్టర్ డాక్టర్ సయ్యెదా అజీమ్ ఉన్నీసా సహా ఆయా విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed