Jaggareddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు జగ్గారెడ్డి ఆందోళన..

by Vinod kumar |   ( Updated:2022-06-03 11:27:18.0  )
Jaggareddy
X

దిశ, ముషీరాబాద్: Jaggareddy protesting at minister sabitha indrareddys residence demands to postpone tet| టెట్ వాయిదా వేయాల‌ని డిమాండ్ చేస్తూ.. ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో శ్రీన‌గ‌ర్‌కాల‌నీలోని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి నివాసం ముందు ఆందోళ‌న జ‌రిగింది. ఈ ఆందోళ‌న‌కు మ‌ద్దతుగా ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి హాజ‌రై స‌బితా ఇంటి ముందు బైఠాయించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆర్ఆర్‌బి రెండో విడ‌త ప‌రీక్ష, టెట్ ఒకే రోజు ఉన్నాయ‌న్నారు. రెండు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ ఉన్నార‌న్నారు. టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అపాయింట్‌మెంట్ అడిగితే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ఇవ్వర‌ని.. ఫోన్ చేస్తే మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఎత్తడం లేద‌ని, టెట్‌ను వాయిదా వేయాల‌ని జ‌గ్గారెడ్డి ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయవద్దన్నారు. నాలుగు రోజుల క్రితం ప్రజల సమస్యల పై చెప్పేందుకు అపాయింట్‌మెంట్ అడుగుతున్నామ‌ని, కానీ సీఎం కేసీఆర్‌ కానీ, మంత్రి కేటీఆర్ కానీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేద‌న్నారు.

టెట్ నోటిఫికేషన్ నెల రోజుల క్రితం వచ్చిందని, ఆర్ఆర్‌బి ఏడాది క్రితం నోటిఫికేషన్ వచ్చింద‌న్నారు. టెట్, ఆర్ఆర్‌బి రెండు పరీక్షలు రాసే వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఒకే రోజు పరీక్షతో ఆర్ఆర్‌బి రెండో పరీక్షకు హాజరు కాలేకపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో బాధ్యతాయుతంగా స‌బితా ఇంద్రారెడ్డి పనిచేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యాక ఇలా త‌యార‌య్యార‌ని ఎద్దేవా చేసారు. కేంద్రం ఏడాది క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ మార్చుకోమని స‌బితా అన‌డం ఆమె అవ‌గాహ‌న‌ర‌హితానికి నిద‌ర్శన‌మ‌న్నారు. అవగాహన లేని మంత్రిగా స‌బితా మారిపోయారని విమ‌ర్శించారు. రాష్ట్రంలో పోలీసులను పెట్టి పాలన చేయాలని చూస్తున్నార‌న్నారు. టెట్ తేదీ మార్చేందుకు ఇబ్బంది ఏంటి..? అని జ‌గ్గారెడ్డి ప్రశ్నించారు. మంత్రి క‌నీసం ఫోన్ ఎత్తడంలేద‌న్నారు. స‌బితా ఇంద్రారెడ్డి మ‌న‌సు క‌రిగి టెట్ వాయిదా వేయాల‌ని కోరారు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధ‌ర్నాలో ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు వెంక‌ట్‌, ఎన్ఎస్‌యుఐ నాయ‌కులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed