షాపింగ్ మాల్స్ పై ఐటీ శాఖ అధికారులు దాడులు అందుకేనా...?

by srinivas |
షాపింగ్ మాల్స్ పై ఐటీ శాఖ అధికారులు దాడులు అందుకేనా...?
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు వ్యాపారవేత్తలకు దడపుట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ వ్యాపార వేత్తలు చాలామంది గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న ఐటీ శాఖ ఆకస్మిక తనిఖీలు వల్ల కొన్ని ప్రముఖ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. గత ఆగస్టులో వాసవి , సుమధుర కన్ స్ట్రక్షన్స్, ఫినిక్స్ తదితర సంస్థల పై దాడులు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు పలు కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా శుక్రవారం మరో మారు అధికారులు ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్, లాట్ మొబైల్స్ లోనే కాకుండా యాజమాన్యాల నివాసాలు, కార్యాలయాలు ఇతర ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు చేసింది. ఏకంగా 15 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఆయా మాల్స్ పై ఏకకాలంలో దాడులు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగ ఇటీవల ముగియగా మరో పది రోజుల్లో దీపావళి పండుగ ఉంది. దీంతో ఆయా మాల్స్ లో ముఖ్యంగా వస్త్రాలు విక్రయించే ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ వంటి వారిపై దాడులు నిర్వహించడం నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఏం జరుగుతోంది....

ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్స్ పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించే సమయంలో సిబ్బందితో సహా ఇతరులను లోనికి ఎవరినీ రానివ్వలేదు. గంటల సమయం తర్వాత సిబ్బందిని , కొనుగోలుదారులను అనుమతించారు. మాల్స్ ఉదయం తెరిచిన వెంటనే ఉదయం 9 గంటలకే అధికారులు రావడంతో నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీనికితోడు కొనుగోలు కోసం వచ్చిన వారు కూడా లోపల ఏం జరుగుతుందనేది అర్థం కాక సిబ్బందిని ఆరా తీశారు. ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారనే తెలుసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే ఇదే సమయంలో ఇతర వ్యాపార సంస్థల నిర్వాహకులు కూడా అప్రమత్తమై అధికారులు ఒకవేళ తమ మాల్స్ పై కూడా దాడులు చేస్తే ఎలాంటి ఆధారాలు దొరకకుండా అప్రమత్తమయ్యారు . దిల్‌సుఖ్ నగర్ లో మధ్యాహ్నం 2 గంటల వరకు, కూకట్ పల్లిలో 3 గంటల వరకు అధికారులు తనిఖీలు చేపట్టిన మాల్స్ లోని హార్డ్ డిస్క్ లతో పాటు ఇతర ఆధారాలు సీజ్ చేసి వెంట తీసుకువెళ్లారు .

పండుగల వేళ జీరో దందా ....

ఆర్ఎస్ బ్రదర్స్ , సౌతిండియా షాపింగ్ మాల్స్, లాట్ మొబైల్స్ తదితర మాల్స్ దసరా, దీపావళిని పండుగను పురస్కరించుకుని పలు ఆఫర్లు ప్రకటించారు. కిలోల కొద్ది బంగారం , వాహనాలు, కిచెన్ వేర్, బ్యాగులు, సూట్ కేస్ ల వంటివి ఆయా పండుగల సందర్భంగా కొనుగోలు దారులకు ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పించారు. కొన్ని మాల్స్ డ్రా వంటివి లేకుండానే చిన్న చిన్న బహుమతులను అందజేయగా మరికొన్ని మాల్స్ లక్కీ డ్రా లో తేలిన వారికి ఇవ్వనున్నట్లు బ్రోచర్లు, యాడ్స్ రూపంలో ప్రచారం చేసుకున్నారు. ఇవీ పూర్తిగా జీరో దందాలో చేపడుతున్నారనే సమాచారంతో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వాహకులు ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు . నర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో వ్యాపారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా హానర్స్ , సుమధుర, వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి వ్యాపారాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు దాడులు సందర్భంగా గుర్తించారు .

మీడియాతో మాట్లాడకుండానే....

నగరంలోని ఆర్ఎస్ బ్రదర్స్ , సౌతిండియా షాపింగ్ మాల్స్, లాట్ మొబైల్స్ తదితర చోట్ల ముంబై నుంచి వచ్చిన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు ఒక్కో మాల్ లో ఐదు నుండి ఆరు గంటల పాటు అధికారులు సోదాలు చేశారు. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు దాడులు జరుగుతున్న మాల్స్ వద్దకు చేరుకుని గంటల పాటు ఎదురు చూసినప్పటికీ వారితో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో అసలేం జరుగుతుందనేది బహిర్గతం కాలేదు.

Next Story

Most Viewed