రాజాసింగ్‌కు ఏడాది జైలు జీవితం తప్పదా..?

by Javid Pasha |
రాజాసింగ్‌కు ఏడాది జైలు జీవితం తప్పదా..?
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌కు ఏడాది పాటు జైలు జీవితం తప్పదా ? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. పాత కేసుల్లో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి, జైలుకు తరలించారు. ఆయనపై మొత్తం 101 కేసులు ఉండగా వీటిల్లో 18 మతపరమైనవి ఉన్నాయి. అయితే వీటిలో బెయిలబుల్, నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. రాజాసింగ్ తరచుగా చేసే వ్యాఖ్యలతో హైదరాబాద్ వంటి మహానగరంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, అనేక అల్లర్లకు దారి తీసే ప్రమాదముందని భావించిన పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.

పీడీ యాక్ట్ నమోదైన వారిని వారిపై ఆ యాక్ట్ ఎందుకు నమోదు చేశామనే విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టకుండానే నేరుగా జైలుకు తరలించే అధికారం పోలీసులకు ఉంది. పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రయోగించి వారిని జైలుకు పంపే పోలీసులు రాజాసింగ్‌ను కూడా అదే తీరులో జైలుకు తరలించారు. ఇలా నమోదైన పీడీ యాక్ట్‌ను రివోక్ చేసే అధికారం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు ఉంటుంది. అయితే రాజాసింగ్ విషయంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే విషయంపై ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రాజాసింగ్‌పై కోర్టు న్యాయస్థానం పీడీ యాక్ట్ రివోక్ చేయకపోతే ఏడాది పాటు ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Next Story