కేబీఆర్ మల్టీలెవల్ పార్కింగ్ అవసరమా?

by Mahesh |
కేబీఆర్ మల్టీలెవల్ పార్కింగ్ అవసరమా?
X

దిశ, సిటీబ్యూరో : నగరంలోని కేబీఆర్(KBR) పార్క్ వద్ద సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం మల్టీలెవల్ పార్కింగ్‌ (Multilevel Parking)ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఈ అంశంపై స్టాండింగ్ కమిటీలో చర్చించారు. అయితే దీని సాధ్యాసాధ్యాలపై చర్చించడం తో పాటు సంబంధిత స్థలాన్ని పరిశీలించిన తర్వాతే ప్రతిపాదనలను ఆమోదించాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే బుధవారం కేబీఆర్ స్థలాన్ని మేయర్, కమిటీ సభ్యులు పరిశీలించారు. మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటుపై అదనపు కమిషనర్ (అడ్వర్ టైజ్‌మెంట్), నిర్మాణ సంస్థ ప్రతినిధులపై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. మల్టీలెవల్ పార్కింగ్ ద్వారా ఏడాదికి రూ.28 లక్షలు జీహెచ్ఎంసీకి చెల్లిస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మల్టీలెవల్ పార్కింగ్ లో 70 కార్లు పార్కు చేసే అవకాశముంది. ఇదిలా ఉండగా కేబీఆర్ పార్క్ వద్దకు ప్రతి రోజూ 40 కార్లు మాత్రమే వస్తున్నాయని, అదనంగా 30 కార్ల కోసమే ఈ ప్రతిపాదన అవసరమా? అని మేయర్ ప్రశ్నించారు.

రూ.10 కోట్ల ఖర్చు..

మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణానికి రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని నిర్మాణ సంస్థ అంచనా వేసింది. 500 గజాల స్థలాన్ని 20 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుని మల్టీలెవల్ పార్కింగ్‌తో పాటు డిజిటల్ అడ్వర్ టైజ్‌మెంట్, క్యాంటీన్ కూడా నడపనుంది. అయితే నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ వద్ద 500 గజాల స్థలాన్ని లీజు కిస్తే నెలకు రూ.20 లక్షల ఆదాయం వస్తుందని సభ్యులు భావిస్తున్నారు. నెలకే రూ.20 లక్షల ఆదాయం వస్తే సంవత్సరానికి రూ.28 లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో పాటు దీనికి సంబంధించి ఏదైనా డిజైన్ ఉందా? అని అడిషనల్ కమిషనర్‌ను సభ్యులు అడిగారు. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన నిర్మాణ సంస్థ తమ పట్ల దురుసుగా ప్రవర్తించిందని, ఇది సరైంది కాదని మేయర్, సభ్యులు మండిపడ్డారు. ఈ ప్రతిపాదనల విషయంలో తిరకాసు ఉందంటూ తిరస్కరిస్తున్నట్టు, దీనిపై మరోసారి చర్చించాలని స్టాండింగ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా గతంలోనూ షేక్‌పేట్ నాలా, జవహార్ నగర్ డంపింగ్ యార్డు విషయంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు పరిశీలన పేరుతో వెళ్లి రచ్చ చేశారనే విమర్శలు లేకపోలేదు. స్టాండింగ్ కమిటీ సభ్యుల పరిశీలన అంటేనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు.



Next Story

Most Viewed