సీనియర్ డాక్టర్ల పోస్టింగ్‌లో అన్యాయం.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

by samatah |
సీనియర్ డాక్టర్ల పోస్టింగ్‌లో అన్యాయం.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : సీనియారిటీ‌ని పట్టించుకోకుండా సీనియర్ డాక్టర్ల పోస్టింగ్స్ లో అన్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబురావు అన్నారు. ఎంతోకాలంగా రాష్ట్ర స్థాయి అధికారులకు, మంత్రులకు, గవర్నర్‌కు, ప్రతిపక్ష నాయకులకు, వివిధ పార్టీల నేతలకు వినతి పత్రాలు ఇచ్చామని, సమస్య పరిష్కరించమని ఎన్నోసార్లు వివిధ రూపాలలో తమ నిరసనను వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్, డి.ఎం.ఈ పరిధిలో ఉన్న రాష్ట్రస్థాయి పోస్టుల్లో సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా జూనియర్, అనర్హులైన వారిని డీ.హెచ్ , డీ.ఎం.ఈ గా గత ఏడు సంవత్సరాల నుండి అదే పోస్టులో కూర్చోబెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీ డాక్టర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే సీనియార్టీ‌ని పరిగణలోకి తీసుకొని పోస్టులు కేటాయించాలని కోరారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా డీ.హెచ్, డీ.ఎం.ఈ లను మార్చాలని , సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు అడిగిన ప్రశ్నకు స్వయంగా సీఎం కేసీఆర్ సమాధానం ఇస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని అన్నారు. జూనియర్లు హెచ్ఓడీలుగా మారిన తర్వాత జూనియర్లపై అక్రమ కేసుల్లో ఇరికించి , అనవసరమైన చోటికి బదిలీ చేయడం ఇలాంటివి చేస్తున్నారని వాపోయారు . ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వివిధ హోదాలలో అక్రమంగా పనిచేస్తున్న జూనియర్లను వెంటనే తొలగించి సీనియార్టీ లో ముందు ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని , లేకపోతే పూర్తిస్థాయి ఆందోళనకు పిలుపు ఇస్తామని అన్నారు.

Next Story

Most Viewed