వీరశైవ లింగాయత్​లను ఓబీసీలో చేర్చండి: రాజ్యసభ సభ్యుడు ఆర్. క్రిష్ణయ్య

by Disha Web Desk 11 |
వీరశైవ లింగాయత్​లను ఓబీసీలో చేర్చండి: రాజ్యసభ సభ్యుడు ఆర్. క్రిష్ణయ్య
X

దిశ, ముషీరాబాద్: వీరశైవ లింగాయత్​లను ఓబీసీలో చేర్చి, 500 కోట్లు బడ్జెట్ తో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య అన్నారు. రాష్ట్ర వీరసేవ లింగాయత్ , లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సంఘం అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ ఆర్. క్రిష్ణయ్య హాజరై మాట్లాడారు. వీరశైవ లింగాయత్ లను ఓబీసీ లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్న వీరశైవ లింగాయత్​లను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని గతంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని అన్నారు.

కానీ ఇంత వరకు జాబితాలో చేర్చలేదన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు. బీసీలకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు. రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50 శాతాన్ని సుప్రీం కోర్టు తొలగించినందున ఎలాంటి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేనందున బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు చెల్లుతాయని, 50 శాతం గరిష్ట పరిమితి కూడా సరికాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖలలో, 245 ప్రభుత్వ రంగ సంస్థలలో 16 లక్షలు ఖాళీలు పెండింగ్ లో పెడుతున్నారని కృష్ణయ్య ధ్వజమెత్తారు. ఒక రైల్వే శాఖలో 3 లక్షల 53 వేల ఉద్యోగాలు వివిధ బ్యాంకులలో ఒక లక్ష 30 వేల ఉద్యోగాలు రక్షణ రంగ సంస్థలలో నాలుగు లక్షల 30 వేల ఉద్యోగాలు, ఇలా వివిధ శాఖలలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

వీరశైవ లింగాయత్​లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి, పంచాయత్, అసెంబ్లీ ఎన్నికలలో వారి జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సంగమేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ కుమార్, కోశాధికారి దినేష్ పాటిల్, రాజప్ప, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు శివశరణ్, యువజన సంఘం అధ్యక్షుడు రాజప్ప, మహిళా సంఘం గౌరవ అధ్యక్షురాలు లక్ష్మీ, రాష్ట్ర అధ్యక్షురాలు శెట్టి మంజుల, జన ప్రధాన కార్యదర్శి భరత్, సంక్షేమ సంఘ జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed