నగరంలో ఆకట్టుకున్న ఫార్ములా-ఈ ప్రిక్స్‌ కార్లు..

by Vinod kumar |
నగరంలో ఆకట్టుకున్న ఫార్ములా-ఈ ప్రిక్స్‌ కార్లు..
X

దిశ, శేరిలింగంపల్లి: వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా-ఈ ప్రిక్స్‌ పోటీల్లో దూసుకెళ్లబోయే కార్లను నగర ప్రజలకు పరిచయం చేసే భాగంగా జెన్‌-2 రకానికి చెందిన రెండు ఎలక్ట్రిక్‌ కార్లను ఆదివారం ట్యాంక్‌బండ్, దుర్గం చెరువు వద్ద ప్రదర్శనకు ఉంచారు.

దేశంలో తొలిసారిగా ఫార్ములా-ఈ పోటీలను నిర్వహించనుండడంతో ఈ కార్లను హైదరాబాద్‌‌తో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో కొన్ని వారాలపాటు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫార్ములా వన్‌ కార్ల తరహాలోనే నేలను తాకినట్లుగా ఉండే వీటి డిజైన్, ఓపెన్‌ కాక్‌ పిట్, సింగిల్‌ సీట్‌ కలిగి ఉంటాయి.


హైదరాబాద్‌లో జరిగే పోటీలో జెన్‌-3 రకం ఈవీ కార్లను తొలిసారిగా వీక్షకులను అలరించనున్నాయి. ఈవీ కార్లు 62 కి.మీ వేగాన్ని కేవలం 3 సెకన్లలో అందుకుంటే జెన్‌-3 రకం ఈవీ కార్లు సున్నా నుంచి 100 కి.మీ వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకోవడం వీటి ప్రత్యేకత. జెన్‌-2 ఈవీ కార్లకు ఫార్ములా వన్‌ రేసుల్లాగా ప్రత్యేక ట్రాక్‌‌లు నిర్మించాల్సిన అవసరం లేదని, కేవలం సాధారణ రోడ్లపైనే పరుగులు తీయగలగడం ఈవీ కార్ల ప్రత్యేకతని వెల్లడించారు.


నగరంలోని నెక్లెస్‌ రోడ్డులో ఉన్న 2.8 కి.మీ మార్గం ఫార్ములా-ఈ ప్రిక్స్‌ పోటీలకు అనుకూలంగా ఉండటం వల్లే భాగ్యనగరాన్ని నిర్వాహకులు ఇందుకు ఎంపిక చేశారని, వచ్చే ఏడాది జనవరి నుంచి జూలై మధ్య ప్రపంచ వ్యాప్తంగా 12 నగరాల్లో జరగనున్న 18 ఫార్ములా-ఈ ప్రిక్స్‌ రేసుల్లో నాలుగో రేసు హైదరాబాద్‌‌లో జరగనుంది. ఆదివారం రాయదుర్గం కేబుల్ బ్రిడ్జిపై ప్రదర్శనకు ఉంచిన ఈ ఫార్ములా కార్ల ను తిలకించేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరిచారు. మున్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఫార్ములా కార్ల ను పరిశీలించారు. నగరం కారు రేసింగ్‌ల నిర్వహణకు సంసిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed