పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు

by Shiva |
పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు
X

దిశ, దుండిగల్: దుండిగల్ మున్సిపాలిటీ‌లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారాలు కన్నెత్తి చూడడం లేదు. దుండిగల్ మున్సిపాలిటీలో 14 మంది వార్డు అధికారులు ఉన్నప్పటికీ వారు ఆఫీసుకే పరిమితం కావడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీలోని ఆరు గ్రామాల్లో ప్రతి వార్డులో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారుల ఉదాసీన వైఖరి వల్ల అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. గాగిల్లపూర్ తండాలో ఓ కౌన్సిలర్ తన అధికారాన్ని అడ్డంపెట్టుకొని నాలుగంతస్తుల అక్రమ నిర్మాణం చేపడుతున్నా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

చైన్‌మెన్లదే హవా

అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి మున్సిపల్ ఆదాయాన్ని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ఇటీవల వార్డు అధికారులను కొత్తగా నియమించింది. దుండిగల్ మున్సిపాలిటీ‌లో మొత్తం 28 వార్డులు ఉండగా 14 మంది వార్డు అధికారులు కొత్తగా నియమించబడ్డారు. వీరు మున్సిపాలిటీలో జరుగుతున్న అనుమతి లేని నిర్మాణాలను గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. వారి నివేదిక ఆధారంగా అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నివేదికలకు తిలోదకాలిస్తూ ఔట్‌సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న చైన్‌మెన్లకే ప్రాధాన్యం ఇస్తూ సదరు సిబ్బంది చెప్పిందే వేదం అన్నట్లు సాగుతుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడటం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు.

Next Story