సమస్యలు పరిష్కరించకపోతే జలమండలిని ముట్టడిస్తాం.. కార్పొరేటర్ పవన్ కుమార్

by srinivas |   ( Updated:2022-10-12 12:49:10.0  )
సమస్యలు పరిష్కరించకపోతే జలమండలిని ముట్టడిస్తాం.. కార్పొరేటర్ పవన్ కుమార్
X

దిశ చైతన్యపురి : కొత్తపేట డివిజన్ లో నెలకొన్న డ్రైనేజీ, నీటి సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జలమండలి కార్యాలయం లో జనరల్ మేనేజర్ బలరాం ను కలిసి సమస్యలను వివరించారు. గత సంవత్సర కాలం నుండి కనీసం ఒక్క డ్రైనేజీ లైన్ కూడా మంజూరు చేయక పోగా కనీసం మరమ్మత్తు చేసే ప్రయత్నం చేయడం లేదని అన్నారు.

గతంలో ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా పట్టించుకోవడం లేదని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా డ్రైనేజ్ సమస్యలు తలెత్తుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనీ త్రాగునీటిలో డ్రైనేజ్ నీరు కలుషితమై ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నెలల తరబడి గుంతలు తీసి వదిలేస్తున్నారని కాలనీ ప్రజలు అధికారులను సంప్రదించి వాళ్ల సమస్యలను తెలియజేయాలని వస్తున్నా అధికారులు స్పందించడం లేదని అన్నారు. కొత్తపేట డివిజన్లో డ్రైనేజ్ లైన్లన్నీ మంజూరు చేయాలని, సమస్యలున్న డ్రైనేజ్ లైన్ లను గుర్తించి వెంటనే వాటిని మరమత్తులు చేయించాలని లేనిచో భారీ ఎత్తున డివిజన్ ప్రజలతో కలిసి జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

Next Story

Most Viewed