వేర్వేరు చోట్ల హెరాయిన్, ఓపీఎం స్వాధీనం

by Sridhar Babu |
వేర్వేరు చోట్ల హెరాయిన్, ఓపీఎం స్వాధీనం
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాలను కట్టడి చేసే లక్ష్యంతో ఎక్సైజ్ పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మత్తు పదార్థాలను పెట్టుకోవడంతో పాటు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం శేరిలింగంపల్లి తారానగర్ లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో స్కూటీపైన వస్తున్న త్రిలోక్ (32)ను ఆపి తనిఖీ చేయగా అతని వద్ద 300 గ్రాముల ఓఎపీఎం డ్రగ్ పట్టుబడింది. అతన్ని విచారించగా గిరిధర్ అనే వ్యక్తి రాజస్థాన్ నుండి ఓపీఎం తీసుకువచ్చి తనకు ఇస్తాడని, దానిని అమ్మి ఆయనకు డబ్బులు ఇస్తే తనకు కమిషన్ ఇస్తాడని తెలిపాడు.

గిరిధర్ పై గతంలో బాలానగర్ పరిధిలోనూ డ్రగ్స్ సరఫరాకు సంబంధించి కేసు నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన ఓపీఎం విలువ రూ.లక్ష యాభై వేలు ఉంటుందని, నిందితుడి వద్ద నుండి ఒక స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మరో కేసులో 80 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం గోపన్ పల్లి తండా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇస్మత్, అబ్దుల్ వాహిద్ అనే వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 80 గ్రాముల హెరాయిన్ పట్టుబడింది. వారిని విచారించగా తాము వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మాల్డా నుండి హెరాయిన్ ను కొనుగోలు చేసి అవసరమైన వారికి అమ్మేందుకు ఆఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో నగరానికి తీసుకువచ్చామని తెలిపారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఒక్కరోజే ఆరున్నర లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed