భాష్యం స్కూల్లో దారుణం.. విరిగిన విద్యార్థి మోచేతి మనికట్టు

by Sathputhe Rajesh |
భాష్యం స్కూల్లో దారుణం.. విరిగిన విద్యార్థి మోచేతి మనికట్టు
X

దిశ, ఎల్బీనగర్: హయత్ నగర్ భాష్యం స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. స్కేటింగ్ చేస్తుండగా ఏడవ తరగతి విద్యార్థి కింద పడి మోచేతి మనికట్టు విరిగింది. ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... వినాయక నగర్ కు చెందిన అనంతుల రిత్విక్ రెడ్డి (11) హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీలోని భాష్యం బ్లూమ్స్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. అయితే ఈనెల 14వ తేదీన స్కూల్లో స్కేటింగ్ చేస్తుండగా కిందపడ్డాడు. దీంతో రిత్విక్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ విషయం స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేయడంతో రిత్విక్ తండ్రి అనంతుల నర్సిరెడ్డి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం దగ్గరలోని హాస్పటల్లో పరీక్షలు చేయించగా మోచేతి మనికట్టు విరిగినట్టు తేలింది. దీంతో అతడి చేతికి వైద్యులు సర్జరీ చేశారు. అయితే తన కుమారుడి చేయి విరగడానికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, స్కేటింగ్ కు అవసరమైన ప్లేగ్రౌండ్ లేకపోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఘటన జరిగిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూలు యాజమాన్యంపై విద్యాశాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కనీస జాగ్రత్తలు పాటించని భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలని కోరారు.





Next Story

Most Viewed