ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవరుచుకోవాలి: గవర్నర్ తమిళిసై

by Seetharam |
ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవరుచుకోవాలి: గవర్నర్ తమిళిసై
X

దిశ, సికింద్రాబాద్: ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవరుచుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఈరోజుల్లో అందరి ఇంట్లో రెండు, మూడు బెడ్రూమ్‌లు ఉన్నాయని గొప్పగా చెబుతున్నారని.. రీడింగ్ రూమ్ ఉందని చెప్పేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు. అందరూ తమ ఇళ్లలో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసుకొని, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. నేత్రుత్వ సాధన (ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సోషియోపాలిటికల్ లీడర్షిప్) 14 వ దశ ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ గురువారం ప్రసంగించారు. రాంభావు మాల్గి ప్రబోధిని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్షిప్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ క్లూజివ్ గవర్నెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీఆర్ ఆర్ సీడీఈ సెంటెనరీ ఆడిటోరియంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకి వాళ్ళ నియోజకవర్గంలోని బోర్డర్ కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారని, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న రోడ్ల గురించి వాళ్ళే విమర్శ చేయడం హాస్యాస్పదం అన్నారు. ఒకప్పుడు భారతీయులు విదేశీ వస్తువుల పట్ల మోజు చూపించేవారని, కానీ స్వదేశంలో తయారైన వస్తువుని వాడడంలో వెనుకంజలో ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆత్మ నిర్భర భారతను ప్రవేశపెట్టిన తరువాత జీఐ ద్వారా వస్తువుల తయారీ తెలుసుకుని వినియోగించడం ఆనందంగా ఉందన్నారు. మేకిన్ ఇండియా ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మాస్కులు పెట్టుకుని గర్వపడుతున్నానని చెప్పారు. దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్రికల్చర్ మెడిసిన్ రంగాలలో కూడా అమలు చేయాలని సూచించారు.

గతంలో టీబీ, రూబెల్లా వంటి వ్యాధులకు వ్యాక్సిన్ కనిపెట్టిన తరువాత పది పదిహేనేళ్ల అనంతరం మన దేశానికి వచ్చేవని, కానీ ప్రపంచమంతా వణికిపోయిన కరోనాకు కేవలం 11 నెలల్లో వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత మన దేశానికే దక్కుతుందన్నారు. ఆ వ్యాక్సిన్‌ను దాదాపు 150 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. చరిత్రతో సహా అన్ని రంగాల్లో లోతైన పరిశోధనలు చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed