ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

by S Gopi |
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
X

దిశ, ముషీరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం తాము చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం బస్ భ‌వ‌న్‌లో సంస్థ ఎండీ, వీసీ సజ్జనార్‌తో క‌లిసి పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో ప్రస్తుతం 3 డీఏలను చెల్లించనున్నట్లు, అందుకోసం రూ.15 కోట్లతోపాటు డీఏ బకాయిల కోసం మరో రూ. 20 కోట్లు కేటాయించడం జరుగుతోందన్నారు. అలాగే, ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ ను కూడా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ. 20 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. సకల జనుల సమ్మె కాలంలో 8053 మంది ఉద్యోగులకు జీతాలు రాలేదని, వీరి జీతాల చెల్లింపుల కోసం రూ. 25 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. పదవీ విరమణ చేసిన సిబ్బంది ఈఎల్ ను చెల్లించేందుకు మరో రూ. 20 కోట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వ సహాయ, సహకారాలతో తెలంగాణలో ఆర్టీసీ అభ్యున్నతి దిశగా పయనిస్తోందని, ఇతర రాష్ట్రాలలో రోడ్డు రవాణా సంస్థల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందంటూ అక్కడి ప్రభుత్వాలు సంస్థల్ని ఆదుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 1500 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కుతోందని చెప్పారు. గత సంవత్సర కాలంగా పరిశీలిస్తే అప్పట్లో కేవలం రూ. 9 కోట్ల వరకు ఉన్న ఆదాయం ప్రస్తుతం సంస్థకు ఓఆర్ ద్వారా సరాసరి రూ. 14 కోట్ల వరకు వస్తోందని వివరించారు.

తాము బాధ్యతలు చేపట్టిన తరువాత సంవత్సర కాలంలో సంస్థ ఎంతో మెరుగుపడిందని, రానున్న కాలంలో మరింత అభ్యున్నతి దిశగా పయనిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్న పాత అప్పుల కోసం వడ్డీ చెలించడం జరుగుతోందని, సంస్థ పురోభివృద్ధి కోసం ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి వరకు అందరూ కష్టపడుతున్నారన్నారు.

1150 కొత్త బస్సుల కొనుగోలు: సజ్జనార్

ప్రజా రవాణా అవసరాలకనుగుణంగా 1150 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. అలాగే 360 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్‌ను కూడా నిర్వహించడం జరిగిందంటూ ఈ డిసెంబర్ నాటికి బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల్ని ఇంటర్ సిటీ కనెక్టివిటీతో నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ తదితర అన్ని జిల్లాలకు నడుపనున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశలో తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Next Story

Most Viewed