- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కిలో చెత్త రూ.4.. ప్రతి ఇంటి నుంచి GHMC వసూలు!

దిశ, సిటీబ్యూరో : మహానగరంలోని పారిశుధ్య పనుల్లో భాగంగా చెత్త సేకరణలో భాగంగా ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను రాంకీ ఎన్విరో సంస్థకు అమ్ముకునేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. పదేళ్ల క్రితం రాంకీ ఎన్విరోతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇప్పటికే వ్యాపార సంస్థల నుంచి బల్క్ గ్యార్బేజీ కింద జీహెచ్ఎంసీ సేకరించే చెత్తను కిలోకు రెండు రూపాయల 90 పైసలకు చొప్పున రాంకీకి అప్పగించిన జీహెచ్ఎంసీ ఇప్పుడ నగరంలోని ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను కూడా అమ్ముకోవాలని భావిస్తుంది. నగరంలోని వ్యాపార సంస్థలన్నింటి నుంచి ప్రస్తుతం రాంకీ ఎన్విరో సంస్థ కిలో చెత్తకు రెండు రూపాయల 90 పైసలను యూజర్ ఛార్జీలుగా వసూలు చేసుకుంటుంది. దీంతో జీహెచ్ఎంసీకి బల్క్ గ్యార్బేజీతో వచ్చే ఆదాయం రాంకీ ఖాతాలోకి జమ అవుతుంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మహానగరంలోని 30 సర్కిళ్లలో సుమారు 22 లక్షల గృహాలున్నట్లు గుర్తించిన సంగతి తెల్సిందే. ఈ ఇళ్లలో ఉత్పత్తి అవుతున్న చెత్తను ప్రస్తుతం నెలకు రూ.వంద నుంచి రూ.500 నామమాత్రపు ఛార్జీలకే స్వచ్ఛ ఆటో టిప్పర్ల కార్మికులు సేకరిస్తున్న సంగతి తెల్సిందే. ఇకపై రాంకీ సంస్థ ప్రతి ఇంటి నుంచి వస్తున్న చెత్తను అక్కడక్కడే తూకం వేసి, కిలోకు రూ.4ను యూజర్ ఛార్జీలుగా ఇంటి యజమానికి నుంచి వసూలు చేసుకునేలా జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం కమిషనర్ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆయన ఆమోదించే అవకాశాలున్నట్లు తెలిసింది.
నగరవాసులపై అదనపు భారం ఇప్పటికే వాటర్, కరెంటు, ఇంటర్నెట్ బిల్లులతో పాటు అనేక రకాలుగా ఆర్థిక భారాన్ని మోస్తున్న నగరవాసులపై చెత్త యూజర్ ఛార్జీలు అదనపు భారం కానున్నాయి. ప్రస్తుతం నగరంలోని మామూలు రోజుల్లో 4వేల నుంచి 5వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, మోహర్రం, మిలాద్ ఉన్ నబీ, బోనాలు, దీపావళి, వినాయక చవితి పండుగలకు రోజుకు అదనంగా మరో వెయ్యి నుంచి రెండు వేల మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కువగా వస్తుంది. ఇదంతా ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఉచితంగానే సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తుంది. కానీ రెండు, మూడు రోజుల్లో కమిషనర్ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే నగరంలోని 22లక్షల కుటుంబాలు తమ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తకు కిలోకు రూ.4 చెల్లించాల్సిందే.
స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఏం చేస్తారు?
ఆరేళ్ల క్రితం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ మిషన్ ప్రారంభమైన సమయంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి, డంపర్ బిన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో జీహెచ్ఎంసీ 5250 స్వచ్ఛ ఆటో టిప్పర్లను బ్యాంకు లింకేజీ రుణాలతో సమకూర్చింది. ఇప్పుడు ఇంటింటి చెత్త సేకరణ రాంకీ సంస్థకు అప్పగిస్తే వీటిని ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వీటిలో దాదాపు సగానికి పైగా ఆటో టిప్పర్లను బ్యాంక్ ఈఎంఐలు క్లియర్ అయినందున, వీటిని రాంకీ లింకప్ చేసుకుని స్వచ్ఛ కార్మికులకు జీతాలు చెల్లిస్తుందా? లేక రాంకీ తన సొంత వాహనాలతో చెత్తను సేకరిస్తుందా? అన్న విషయపై స్పష్టత రావల్సి ఉంది.