- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షాకాలం యాక్షన్‌లోకి దిగిన GHMC.. గ్రేటర్ పరిధిలో 377 శిథిలావస్థ భవనాల గుర్తింపు
వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్పుడే ముందస్తు చర్యలు చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాకాలం నేపథ్యంలో ఏలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జీహెచ్ఎంసీ ముందస్తు ప్రణాళిక చేపట్టింది. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తింపు, సెల్లార్ల గుర్తింపు వంటి చర్యలు చేపట్టింది. సెల్లార్ల తవ్వకాలను బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీచేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న ప్రమాదకర భవనాలు, పాత ప్రహరీ గోడలు, కొనసాగుతున్న సెల్లార్ తవ్వకాలపై సర్వే నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జోనల్ కమిషనర్లు, సర్కిల్ ఏసీపీలు, సంబంధిత అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు నగరంలోని ఆరు జోన్లలో మొత్తం 377 శిథిల భవనాలను అధికారులు గుర్తించారు. జోన్‌ల వారీగా పరిశీలిస్తే శంషాబాద్‌లో 75, రాజేంద్రనగర్‌లో 117, చార్మినార్‌లో 56, గోల్కొండలో 47, ఖైరతాబాద్‌లో 12, సికింద్రాబాద్‌లో 70 ప్రమాదకర భవనాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గుర్తించిన శిథిల భవనాలకు సంబంధించి యజమానులకు నోటీసులు జారీ చేయడం, అవసరమైతే భవనాలను ఖాళీ చేయించడం, సీల్ వేయడం, కూల్చివేత చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను నియంత్రించాలని సూచించారు.
సెల్లార్ తవ్వకాలు బంద్..
సెల్లార్ తవ్వకాలకి సంబంధించి అనుమతులకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. తవ్విన సెల్లార్‌లలో నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని, రిటైనింగ్ వాల్స్, మట్టి బలోపేతం, బ్యారికేడింగ్ వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని కమిషనర్ సూచించారు. నోటీసులు జారీ చేసినప్పటికీ నిబంధనలు పాటించని వాటి పనులు నిలిపివేయడం, అనుమతులు రద్దు చేయడం, లైసెన్స్ రద్దు చేయడం, నిర్లక్ష్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాన్సూన్ సీజన్ మొత్తం కొత్త సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రమాదకరమైన భవనాల్లో ఉంటున్న ప్రజలు ప్రాణనష్టం జరగకుండా వెంటనే ఇళ్లను ఖాళీ చేసి, జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలని, సెల్లార్ తవ్వకాలు జరిపిన యజమానులు పక్కన ఉన్న భవనాలు కూలిపోకుండా వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు.






