జీహెచ్ఎంసీలో రెండు రోజుల్లో 50 మంది తొలగింపు

by Mahesh |
జీహెచ్ఎంసీలో రెండు రోజుల్లో 50 మంది తొలగింపు
X

దిశ, సిటీబ్యూరో : రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత జీహెచ్ఎంసీలో కూడా ప్రక్షాళన ప్రారంభమైంది. ముఖ్యంగా గత గులాబీ ప్రభుత్వంలోని పెద్దలకు దగ్గరగా వ్యవహరించిన అధికారులను తొలగించాలన్న లక్ష్యంతో ఈ ప్రక్షాళన కొనసాగుతుంది. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో అడ్వర్‌టైజ్‌మెంట్ విభాగంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అడ్వర్‌టైజ్‌మెంట్ ఆఫీసర్ కార్తీక్‌ను ఇప్పటికే తన మాతృశాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా వెలుగులోకి వస్తున్న ఫేక్ ఫింగర్ ప్రింట్ల వ్యవహరంపై కమిషనర్ రోనాల్డ్ రోస్ శనివారం సీరియస్ అయ్యారు. ఇంతలోనే శేరిలింగంపల్లి సర్కిల్‌లో ఫేక్ ఫింగర్ ప్రింట్‌లతో అటెండెన్స్ వేస్తూ మరో 11 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు పట్టుబడటంతో వారిని కూడా విధులు నుంచి తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.

అన్ని సర్కిళ్లలో ఇలాంటి అక్రమాలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూసిన అబిడ్స్, నాంపల్లి, సికింద్రాబాద్, ముషీరాబాద్, చందానగర్ సర్కిళ్లలో కూడా శానిటేషన్ కార్మికులు అటెండెన్స్ పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం అంబర్‌పేటలో వెలుగుచూసిన నకిలీ ఫింగర్ ప్రింట్ వ్యవహారంలో భాగంగా అక్కడి మెడికల్ ఆఫీసర్ జ్యోతిబాయికి మెమో జారీ చేశారు. శేరిలింగంపల్లి తదితర సర్కిళ్లలో ఇదే రకం అక్రమాలకు పాల్పడుతూ జీహెచ్ఎంసీ ఖజానాకు కన్నం వేస్తున్న వారిని విధుల్లో నుంచి తొలగించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, రిటైర్డ్ అయిన తర్వాత కూడా జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న 37 మంది ఆఫీసర్లను ఇప్పటివరకు విధుల నుంచి తొలగించారు. మరో 17 మంది అధికారులను త్వరలోనే పంపించేందుకు కమిషనర్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. కమాండ్ కంట్రోల్ ఇన్‌చార్జి అనురాధను కూడాగ త్వరలోనే తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. రిటైర్డ్ అయిన తర్వాత కొనసాగుతున్న ఆఫీసర్ల వివరాలను ప్రభుత్వం తప్పించుకున్న వెంటనే హౌజింగ్ విభాగంలో ఓఎస్‌డీగా విధులు నిర్వహిస్తున్న కన్నా సురేశ్ కుమార్ స్వచ్చందంగా తన పదవీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కానీ నేటికీ కొందరు అధికారులు కొసాగేందుకు మళ్లీ పైరవీలు మొదలుపెట్టారు.

మేయర్ ఆఫీసుకు మినహాయింపు?

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆఫీసులో కూడా రిటైర్డ్ అయిన తర్వాత కొనసాగుతున్న ఇద్దరు ఉద్యోగులను మేయర్ స్పెషల్ రిక్వెస్ట్ మేరకు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు ఓఎస్‌డీలు విజయ్ కృష్ణ, రాజ్‌కుమార్‌లను తన ఆఫీసులో కొనసాగించాలని మేయర్ చేసిన స్పెషల్ రిక్వెస్ట్ మేరకు వారికి తొలగింపు నుంచి మినహాయింపునివ్వటం చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed