జనసేన అధినేత పవన్‌కు షాక్.. పార్టీని వీడనున్న మహిళా నేత..!

by Manoj |
జనసేన అధినేత పవన్‌కు షాక్.. పార్టీని వీడనున్న మహిళా నేత..!
X

దిశ, హిమాయత్ నగర్: జనసేన మహిళా నేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందిన గీతా నాయుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీలో తనకు సముచిత స్థానం దొరకలేదని గత కొంత కాలంగా ఆమె పార్టీ పట్ల, అధినేత పవన్ పట్ల కినుకతో ఉన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ పార్టీ భావజాలాన్ని వినిపిస్తూనే అధినేత పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడితే విరుచుకు పడే గీతా నాయుడు ఇటీవల కాలంలో ఆ దూకుడు తగ్గించడం .. ఆమె రాజీనామా చేస్తున్నారనే వాదనలకు బలం చేకూరుతోంది.

దాదాపు 200లకు పైగా పలు చానెళ్లలో పార్టీ అనుకూల వాదన (డిబేట్) చేసిన గీతానాయుడు ఉన్నఫళంగా ఎందుకు మౌనంగా ఉన్నారన్న దానిపై ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు ఆరా తీయడంలేదు. దీంతో ఆమె మరింత ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. నిజానికి గీతా నాయుడు తమ పార్టీలోకి రావాలని , ఆమె వాయిస్ ను తమ పార్టీకి వాడుకోవాలని గత ఎన్నికల సమయంలో పలు పార్టీలు ప్రయత్నించాయి. జన సేనాని, పవన్‌ను దేవునిలా ఆరాధించే నాయుడు ఆయా పార్టీల ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఒకరకంగా గీతా నాయుడు చేసే డిబేట్లతోనే మహిళల్లో జనసేన పార్టీని మరింత దగ్గర చేసిందనే ప్రచారం కూడా ఉంది.

ఇంత కష్ట పడుతున్నా తనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు రాక, తనకన్నా వెనుక వచ్చిన వారికి పార్టీ అధినేత గుర్తింపు ఇవ్వడం, ఉన్నత పదవులు కట్టబెట్టడం కూడా గీతా నాయుడిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. సీనియర్ అయిన తనను కొంత కాలం క్రితం ప్రకటించిన పార్టీ తెలంగాణ కమిటీలో ఏమాత్రం ప్రాధాన్యత లేని పదవికి ఎంపిక చేసినప్పటి నుంచి పార్టీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా పవన్ తన సేవలను గుర్తించక పోవడం బాధగా ఉందని ఆమె వాపోతున్నట్లు తెలిసింది. గీతా నాయుడు రాజీనామా అన్న ప్రచారమే నిజమైతే.. ఏపీ లో బలం పుంజుకుంటూ అధికార పార్టీ వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా రూపుదిద్దుకుంటున్న జనసేనకు గీతా నాయుడి రాజీనామా వ్యవహారం గట్టి ఎదురుదెబ్బగా మారే ప్రమాదం ఉంది..! మరి అధినేత పవన్ గీతా నాయుడి వ్యవహారంలో చొరవ తీసుకుంటాడా, ఉదాసీనంగా వ్యవహరిస్తారో చూడాలి మరి.

Next Story

Most Viewed