- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చికెన్ వ్యర్థాలతో కలుషితంగా మారుతున్న ఫిష్
మాంసాహారులు అధికంగా ఇష్టపడే చేపలను ఇకముందు తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

దిశ, హైదరాబాద్ బ్యూరో : మాంసాహారులు అధికంగా ఇష్టపడే చేపలను ఇకముందు తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఇదేమిటని అనుకుంటున్నారా ? అవును ఇది నిజం . రెండు రోజుల క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు చేసిన దాడులలో టన్నుల కొద్ది చికెన్ వ్యర్థాలు పట్టుబడ్డాయి. ఈ వ్యర్థాలను హైదరాబాద్ నగరంలో సేకరించి ట్రక్కుల ద్వారా ఏపీలోని చేపల చెరువుల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. వీటిని ఆహారంగా తీసుకున్న చేపలు కూడా విషతుల్యంగా మారుతున్నాయి. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వైద్యులు చేపలు తినవచ్చని సూచిస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారు కూడా చేపలు తినాలంటే భయపడే విధంగా పరిస్థితులు మారాయి. చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలను మేతగా వేయడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. చేపల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎల్లప్పుడూ సాంప్రదాయ మేత అయిన తవుడు, వేరుశెనగ చెక్క లేదా మత్స్యశాఖ ఆమోదించిన గుళికలను మాత్రమే వాడాలి. అయితే చేపల చెరువుల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా చేపలకు కుళ్లిన చికెన్ వ్యర్థాలను వేస్తుండడంతో వాటిని తిన్న చేపలు కూడా కలుషితం గా మారుతున్నాయి . ఫలితంగా తిన్న వారు జబ్బుల బారిన పడుతుండటం, నగరంలో విక్రయించే చేపలలో అధిక శాతం ఏపీ నుంచి వస్తున్నవే కావడం చేపల ప్రియులను ఆందోళనలకు గురి చేస్తోంది.
పట్టుబడిన టన్నుల కొద్ది వ్యర్థాలు...
రెండు రోజుల క్రితం నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, ఇతర విభాగాల అధికారులు నిర్వహించిన దాడులలో ప్రతి ఒక్కరు విస్తుపోయేలా చికెన్ వ్యర్థాలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఏడు ట్రక్కులలో సుమారు వంద టన్నుల చికెన్ వ్యర్థాలు కుళ్ళి దుర్వాసన వస్తున్న స్థితిలో ఉండగా వీటిని ఏపీలోని చేపల చెరువుల నిర్వాహకులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అధికారులు గుర్తించారు. ఇలాంటి వ్యర్థాలు చేపలకు వేస్తే వాటిని తిన్న చేపలు కూడా కలుషితంగా మారి ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉండడంతో అధికారులు వాటిని సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వాస్తవానికి చికెన్ వ్యర్థాలను చెంగిచెర్లలోని రెండరింగ్ పాయింట్ కు తరలించి అందులో నుండి ఈకలను వేరుచేయాలి. వేడి నీటితో శుద్ధి చేసి అనంతరం ప్రాసెసింగ్ చేసి చేపలకు ఆహారంగా వేస్తారు. ఇలాంటివి కొనుగోలు చేసి చేపలకు వేయాల్సిన చేపల చెరువుల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా తక్కువ ధరలకు లభిస్తున్న చికెన్ వ్యర్ధాలను చేపలకు ఆహారంగా వేస్తున్నారు. దీంతో చేపలు కూడా కలుషిత ఆహారం గా మారి వీటిని తినాలంటే కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే ...?
కుళ్లిన మాంసంలో సాల్మొనెల్లా , ఈ-కోలి వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకున్న చేపలను సరిగ్గా ఉడికించకుండా తింటే తీవ్రమైన విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్ , గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. కోళ్ల వ్యర్థాలలో ఆర్సెనిక్, కాడ్మియం, సీసం వంటి భార లోహాలు పేరుకుపోతాయి. ఈ విషపూరిత రసాయనాలు చేపల ద్వారా మనుషుల శరీరంలోకి చేరి కాలేయం, కిడ్నీలు పాడవడానికి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నీటిలో విషపూరితమైన అమ్మోనియా వాయువు, పి.హెచ్ స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయి. దీనివల్ల నీరు దుర్వాసన వస్తుంది. కుళ్లిన మాంసం నీటిలో కరగడం వల్ల ఆ నీరు పూర్తిగా కలుషితం అవుతుంది. వ్యర్థాలు కుళ్లే ప్రక్రియలో నీటిలోని ఆక్సిజన్‌ను ఎక్కువగా వాడేసుకుంటాయి. దీనివల్ల చేపలకు శ్వాస ఆడక నీటిపైకి వచ్చి నోరు తెరిచి గాలి పీల్చడానికి ప్రయత్నిస్తూ చనిపోతాయి.
తరచుగా దాడులు చేయాలి ...
ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో కుళ్లిన మాంసం, చికెన్ టన్నుల కొద్ది పట్టుబడింది. అప్పట్లో పార్శిగుట్టలో అధికారులు జరిపిన దాడుల్లో 800 కిలోల కుళ్లిన చికెన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్‌లోని ఒక చికెన్ సెంటర్‌పై వారసిగూడ పోలీసులు దాడి చేసి 610 కిలోల అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళహాట్ పరిధిలో దాడులు చేసి 300 కిలోల వరకు కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా తరచుగా అధికారులు చేస్తున్న దాడులలో కుళ్లిన మాంసం నిల్వలు దొరుకుతున్నాయి . తాజాగా లారీల కొద్ది పాడై పోయి దుర్వాసన వెదజల్లుతున్న చికెన్ వ్యర్థాలు పట్టుబడడం సంచలనంగా మారాయి. అధికారులు తరచుగా ఇలాంటి దాడులు చేపట్టి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు అంతటా వినబడుతున్నాయి.
చేపలు తినడం వల్ల ప్రయోజనాలు ..
చేపలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును (బీపీ) అదుపులో ఉంచుతాయి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు సమస్యలను చేపలు దూరం చేస్తాయి. చేపలు తినడం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. చదువుకునే పిల్లలకు చేపలు పెట్టడం చాలా మంచిది . ఇవి తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. ఇంతటి ప్రయోజనం ఉన్న చేపలను ఇప్పుడు తినాలంటే మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది .






