జనాలకు భారీగా మోసం చేసిన ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్

by Kalyani |
జనాలకు భారీగా మోసం చేసిన ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్
X

దిశ, శేరిలింగంపల్లి : మరో సంస్థ భారీ మోసానికి పాల్పడింది. తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు అందజేస్తామంటూ ఏకంగా 6979 మందిని రూ.850 కోట్ల మేర నిండా ముంచింది. సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక నేరాల్లో ఇదే అతిపెద్ద స్కాం గా నిలిచింది. ఈ కేసుకు సంబంధించి ఈఓ డబ్ల్యూ ( ఎకనామిక్ అఫైర్స్ వింగ్) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమర్ దీప్ సింగ్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్ అనే వ్యక్తులు సంయుక్తంగా కలిసి 2021లో ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించారు. అమర్ దీప్ సింగ్ ఎండీగా, ఆర్యన్ సింగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా, యోగేందర్ సింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థకు పవన్ కుమార్ ఓదెల వైస్ ప్రెసిడెంట్ గా, బిజినెస్ హెడ్ గా ఉండగా, కావ్య నల్లూరి డైరెక్టర్ గా ఉన్నారు. వీరు 2021 నుంచి ఈ సంస్థను నడుపుతున్నారు. తమ సంస్థలో రూ. 25 వేల నుంచి రూ.9 లక్షల వరకు పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం చెల్లిస్తామని నమ్మిస్తూ ఇప్పటి వరకు 6979 మంది నుంచి రూ.1750 కోట్ల డిపాజిట్లు సేకరించారు. కొత్తలో అధిక మొత్తంలో రిటర్న్స్ రావడంతో గుడ్డిగా నమ్మిన జనాలు ఫాల్కన్ క్యాపిటల్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు.

రూ.850 కోట్ల డబ్బులు తిరిగి కస్టమర్లకు డబ్బులు చెల్లించారు. మిగతా వారికి డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఎప్పుడు డబ్బులు అడిగినా రేపూమాపూ అంటూ కాలయాపన చేస్తూ వస్తుండడంతో అనుమానం వచ్చిన కొంతమంది కస్టమర్లు సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఈఓడబ్ల్యూ అధికారులు శనివారం ఈ సంస్థ బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలా, డైరెక్టర్ కావ్య నల్లూరిలను అరెస్ట్ చేశారు. వారిపై క్రైమ్ నం 10/2025, సెక్షన్లు: బీఎన్ ఎస్ 316(2), 318(4), 61(2) తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1999లోని సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేశారు. నిందితులు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలోని ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.850 కోట్ల భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ (మేనేజింగ్ డైరెక్టర్, ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్), ఆర్యన్ సింగ్ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్), యోగేందర్ సింగ్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)లతో కలిసి ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ ముసుగులో స్వల్పకాలిక డిపాజిట్లపై అధిక రాబడిని హామీ ఇచ్చి డిపాజిటర్లను ఆకర్షించారని గుర్తించారు. నిందితులు ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫామ్‌ను చట్టబద్ధమైన పీర్-టు-పీర్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ సేవగా తప్పుగా ప్రదర్శిస్తూ మొబైల్ అప్లికేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారని వారు సేకరించిన డబ్బులను బ్రిటానియా, అమెజాన్ గోద్రేజ్ వంటి ప్రసిద్ధ కంపెనీలతో అనుసంధానిస్తున్నట్లు నమ్మించారు. అయితే వాస్తవానికి వారు డిపాజిటర్లను నమ్మించి నకిలీ ఒప్పందాలను రూపొందించారని తేలింది. నిందితులు మునుపటి పెట్టుబడిదారులకు రిటర్న్‌లను చెల్లించడానికి నిరంతరం కొత్త డిపాజిటర్లను నియమించుకున్నారు. క్లాసిక్ పోంజీ పథకాన్ని ఏర్పాటు చేసి వారు సేకరించిన నిధులను వివిధ షెల్ కంపెనీలలోకి మళ్లించారు. జనవరి 15, 2025 నాటికి ఈ పథకం కూలిపోయింది. వాగ్దానం చేసిన రిటర్న్‌లు నిలిపివేయబడ్డాయి, అలాగే కార్యాలయం మూసివేయబడింది. దీంతో డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదులు దాఖలు చేశారు.

నిధుల మళ్లింపు..

నిందితులు డిపాజిటర్ల నిధులను బహుళ కంపెనీలను స్థాపించడానికి దుర్వినియోగం చేశారు. మొత్తం 14 కంపెనీలను స్థాపించారు. వాటిలో కాయిన్ ట్రేడ్ క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్, బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా మల్టీ-లెవల్ మార్కెటింగ్ పథకాలకు యూకియో రిసార్ట్ (గోవా) లగ్జరీ హాస్పిటాలిటీ, ప్రెస్టీజ్ జెట్స్ (దుబాయ్) ప్రైవేట్ చార్టర్ సేవలు, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్ (దుబాయ్) - రియల్ ఎస్టేట్ పెట్టుబడులు. ఆర్డీపి వర్క్‌స్టేషన్ తయారీ, రెట్ హెర్బల్స్ అండ్ రెట్ హెల్త్‌కేర్ ఫార్మాస్యూటికల్స్, ఎంబీర్ (దుబాయ్) సెక్యూరిటీ హౌస్ కీపింగ్ సేవలు. క్యాపిటల్ టెక్సోల్ - ఐటీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, విర్గో గ్లోబల్ @నకోడా, లాజిస్టిక్స్ బీఎస్ ఈ- రిజిస్టర్డ్ కంపెనీ. ఓజాస్ (భారతదేశం, సింగపూర్, యూఏఈ) - సిబ్బంది పెంపుదల, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి సంస్థ, హాష్‌బ్లాక్ - సాఫ్ట్‌వేర్ అభివృద్ధి సంస్థ. వెల్ ఫెల్లా ఇంక్ - హెర్బల్ వ్యాపారం. స్వస్తిక్ నెయ్యి - పాల ఉత్పత్తులు. ఇలా మొత్తం 14 సంస్థలు ఏర్పాటు చేశారు.

గతంలోనూ ఆర్థిక నేరాలు

నిందితులు గతంలో బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దీని ద్వారా ప్రజలను మోసం చేశారు. బహుళ స్థాయి మార్కెటింగ్ పథకం ద్వారా ప్రజలను మోసం చేసిన కేసులో సైబరాబాద్‌లోని చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 126/2022 కింద ఐపీసీ సెక్షన్లు 420, 406, 120(బి) ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం, 1978 కింద కేసు నమోదు అయ్యాయి.

Next Story