ఫేక్ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు

by Disha Web Desk 15 |

దిశ, ఎల్బీనగర్ : నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టును ఎట్టకేలకు రాచకొండ పోలీసులు రట్టు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఎల్బీనగర్ ఎస్ఓటీ టీం, చైతన్యపురి పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముఠాలోని ప్రధాన సూత్రధారుడు పరారీలో ఉండగా మరో ఏడుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ దేవేంద్ర సింగ్ చౌహన్ వివరాలు వెల్లడించారు.

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ద్వారకా పేట గ్రామానికి చెందిన ఆకుల రవి అవినాష్ అలియాస్ అజయ్ (33) వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని చింతల్ లో నివాసం ఉంటున్నాడు. ఇతడు ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయడంలో దిట్ట. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన చింతకాయల వెంకటేశ్వర్లు (51) రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలం క్రితం విజ్ఞాన్ జూనియర్ కళాశాల పేరుతో రెండు బ్రాంచీలను నిర్వహించాడు. అయితే కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో రవి అవినాష్ తో ఇతడికి పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరికీ నల్లగొండ జిల్లా కొత్తపల్లి ఇనువముళ్ల గ్రామానికి చెందిన కొండ్రే నవీన్ కుమార్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కి చెందిన గండికోట జ్యోతి రెడ్డి (25), హైదరాబాద్ చైతన్యపురి లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన పెద్దకోట్ల అభిలాష్ కుమార్ (25), నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అద్దులూరు గ్రామానికి చెందిన దిల్లేకంటి కళ్యాణ్ (23), నగరంలోని ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన పనుకూరి విజయ్ కుమార్ (50)లు ఎనిమిది మంది ఓ ముఠా సభ్యులుగా ఏర్పడి నకిలీ సర్టిఫికెట్ల తయారీతోపాటు క్రయవిక్రయాలకు పాల్పడినట్లు సీపీ చౌహన్ వివరించారు.

ఒకొక్కరి నుంచి రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు

ఈ ముఠా సభ్యులు వందలాది మంది విద్యార్థుల వద్ద రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు వసూలు చేసి నకిలీ సర్టిఫికెట్లను విక్రయించారు. చైతన్యపురి పీఎస్ పరిధిలో విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఈ ముఠా సభ్యుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయని సీపీ వెల్లడించారు. దేశంలోని వివిధ వర్సిటీలకు చెందిన వెబ్ సైట్లను హ్యాక్ చేయడంతోపాటు ఫేక్ వెబ్ సైట్లను రూపొందించి నకిలీ సర్టిఫికెట్ల క్రయవిక్రయాలతో దాదాపు కోట్ల మేరకు దండుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ దర్యాప్తులో ఆకుల రవి అవినాష్, చింతకాయల వెంకటేశ్వరులే కీలకంగా వ్యవహరించి చైన్ సిస్టం ద్వారా విద్యార్థులను ప్రలోభ పెట్టి కోట్లకు పడగలెత్తారని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ లో ప్రధాన సూత్రధారి ఆకుల రవి అవినాష్ పరారీలో ఉండగా మిగతా ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని భారీ స్థాయిలో నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్ల తయారీ ముఠాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఈ ముఠా సభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో డీసీపీ కె. మురళీధర్, ఎస్ఓటీ ఏసీపీ డి.వెంకన్న, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, సీఐలు మధుసూదన్, సుధాకర్, సబ్ ఇన్స్ స్పెక్టర్ లు, వివిధ విభాగాల పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story