శ్రుతిమించుతున్న పబ్ కల్చర్! వ్యభిచారానికి అడ్డా..?

by Nagaya |   ( Updated:2022-10-07 06:12:55.0  )
శ్రుతిమించుతున్న పబ్ కల్చర్! వ్యభిచారానికి అడ్డా..?
X

దిశ, శేరిలింగంపల్లి: భాగ్యనగరం బాధల నగరంగా మారుతోంది. గతమంతా ఘనం.. వర్తమానం అగమ్య గోచరంగా తయారైంది. ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు, అమ్మాయిలపై సామూహిక అత్యాచారాలు కొనసాగుతున్నాయి. కొన్నాళ్లుగా నగరంలో జరుగుతున్న ఘటనలు సర్వత్రా ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. వారంలోనే ఒకదాని తర్వాత మరోటి చోటు చేసుకుంటున్న ఆకృత్యాలతో ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుందని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం, పోలీసులే కాదు సమాజం కూడా విఫలమవుతూనే ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. అనుమతులను అతిక్రమించి నడుస్తున్న పబ్‌లు, హోటల్స్, ఓయో రూమ్స్ వంటి వాటిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పబ్బుల్లో గబ్బు పనులు..

సిటీ తన రూపురేఖలు మార్చుకుంటూ దేశంలోని చాలా నగరాలకు ధీటుగా రూపాంతరం చెందుతోంది. నగరానికి వ్యాపించిన నయా ట్రెండ్‌ను కూడా యూత్ ఫాలో అవుతోంది. ఉదయం వరకు తెరిచి ఉండే పబ్ లు, డ్రైవిన్ రెస్టారెంట్లలో యూత్ ఉంటూనే ఉంది. పబ్‌లు, రెస్టారెంట్లు కూడా పెయిర్ కోసం అంటూ ఆఫర్లు పెట్టి యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. పబ్‌ల్లో మైనర్లు కూడా గానా భజానాలతో చిందులు వేస్తున్నారు. కొన్ని పబ్‌లు మధ్యాహ్నం నుండే ఆఫర్లు పెట్టడంతో యూత్ పట్టపగలే పార్టీల పేరుతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అలా కొందరి చేష్టలు శృతిమించి పెద్దలకు తలనొప్పులు తెస్తున్నాయి. తాజా ఘటన కూడా ఆ నేపథ్యంలో జరిగిందే. మైనర్లు అని తెలిసినా పబ్ నిర్వాహకులు లాభాపేక్షతో వారిని లోపలికి అనుమతిస్తున్నాయి. ఇంటర్ విద్యార్థులు కూడా పార్టీల పేరుతో పబ్బుల్లోకి వెళ్లడం అక్కడ విశృంఖళంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది.

బాధ్యత ఎవరిది..

అనుమతులను అతిక్రమించి, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉదయం వరకూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పబ్‌లు, డ్రైవిన్లపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ప్రదర్శిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. అలాగే ఓయో రూముల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల కాలేజీ విద్యార్థులు కూడా ఓయో రూమ్స్‌కు వెళ్తున్నట్లు విమర్శలున్నాయి. నిర్వా హకులకు అన్నీ తెలిసినా చోద్యం చూస్తున్నారని, అలాంటి వారిపై నిఘా ఉండడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. పబ్‌లు, డ్రైవిన్‌లు, ఓయో రూమ్స్‌పై నిఘా పెట్టాలని, మైనర్లకు అనుమతులు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు నగర జనం.

శృతి మించుతున్న వ్యవహారం..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో పబ్‌లు, డ్రైవిన్ రెస్టారెంట్లు, వందల సంఖ్యలో ఓయో రూమ్‌లు ఉన్నాయి. కొన్ని పబ్‌ల్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాల సరఫరా కూడా జరుగుతుందని గుర్తించిన పోలీసులు వాటి కట్టడి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇటీవల పబ్ యాజమాన్యంతో మాట్లాడి నిబంధనలు మీరితే పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని చెప్పినా పట్టించుకునే యజమానే లేడని తెలుస్తోంది. పోలీసుల నిఘాతో డ్రగ్స్ సరఫరా కాస్తా తగ్గుముఖం పట్టినా మైనర్లకు అనుమతి మాత్రం కొనసాగుతూనే ఉంది. హుక్కా సెంటర్లు, డ్రైవిన్‌లు కూడా ఈ మధ్య అర్ధరాత్రి వరకు ఓపెన్ చేసి ఉంచడంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా నిలుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : పాలతో సైడ్ ఎఫెక్ట్స్...

Next Story