సామాన్యుడికి కోడ్ కష్టాలు!

by Mahesh |
సామాన్యుడికి కోడ్ కష్టాలు!
X

దిశ, రాజేంద్రనగర్: ఎలక్షన్ కోడ్ కూయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు చేసి నగలు, డబ్బులను స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో డబ్బులు తరలించాలంటే నిజమైన బాధితుల గుండెలు గుభేల్ మంటున్నాయి. ఎన్నికల కోడ్ ప్రభావం వివిధ రంగాలపై స్పష్టంగా ప్రభావం చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలు అయింది.

ఒక్కో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గతంలో పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అవుతుండగా ప్రస్తుతం వాటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రధాన కారణం డబ్బుల తరలింపు అని చెప్పవచ్చు. సాగుపై ప్రభావం ఎలక్షన్ కోడ్ ప్రభావం వ్యవసాయ రంగంపై స్పష్టంగా పడుతుంది. గతంలో చాలామంది అడితి దారులు వివిధ వ్యవసాయ మార్కెట్లలో ప్రతిరోజు లక్షల విలువైన కూరగాయలు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయించేవారు. ప్రస్తుతం కోడ్ ప్రభావం ఉండటంతో వారెవరు బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

లబోదిబోమంటున్న రియల్టర్లు..

ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదెలైందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కోడ్ అమలులో లేనప్పుడు చాలామంది వ్యాపారులు పెద్ద పెద్ద పట్టణాలతో పాటు ఆయా మండలాల్లో భూములు, ప్లాట్లు అగ్రిమెంట్ చేసుకునేవారు. తర్వాత వాటిని విక్రయించేవారు. ప్రస్తుతం కోడు అమలులో ఉండ డంతో ప్లాట్లు, భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా కావడం లేదు. వ్యాపారులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు రిజిస్ట్రేషన్‌లను వాయిదా వేసుకుంటున్నారు. ఇలా ప్రతి రంగంపై ఎలక్షన్ కోడ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..

రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తరలించడం సాధ్యం కావడం లేదు. ప్లాటు గాని భూమి గాని అగ్రిమెంట్ చేసుకోవాలంటే లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు వ్యాపారం మానుకున్నాం. - రవీందర్, తిమ్మారెడ్డి గూడెం షాబాద్ మండలం

ఈసీ నిబంధనలు పాటిస్తున్నాం..

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నాం. మేం స్వాధీనం చేసుకున్న డబ్బులను వెంటనే ట్రెజరీకి పంపిస్తున్నాం. ఎవరైనా సరైన ఆధారాలు ఉంటే అక్కడ సమర్పించి డబ్బులు తీసుకోవచ్చు.. దీనికి రెండు మూడు రోజులు పడుతుంది. పది లక్షల కంటే ఎక్కువ ఉంటే ఐటీ శాఖకు పంపిస్తాం.

Next Story