దీపావళి చెత్త 2 వేల మెట్రిక్ టన్నులు

by Mahesh |   ( Updated:2022-10-26 03:17:40.0  )
దీపావళి చెత్త 2 వేల మెట్రిక్ టన్నులు
X

దిశ, సిటీబ్యూరో: దీపావళి పండుగను ఈ సారి నగరవాసులు రెట్టింపు ఉత్సాహంతో ఘనంగా జరుపుకున్నారు. రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి కారణంగా పండుగలు జరుపుకోని నగరవాసులు ఈ సారి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఒక వైపు సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహిస్తూనే సోమ, మంగళవారాల్లో భారీగా టపాకాయలు కాలుస్తూ కేరింతలు కొట్టారు. రోడ్లపై, కాలనీ రోడ్లపై, బస్తీల్లో భారీగా పటాకాయలు కాల్చడంతో సుమారు నాలుగు వేల మెట్రిక్ టన్నుల చెత్త అదనంగా వచ్చిందని, ఇంకా చెత్త సేకరణ కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మామూలు రోజుల్లో జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలోని 22 లక్షల ఇళ్ల నుంచి, వ్యాపార సంస్థల నుంచి సుమారు నాలుగున్నర వేల నుంచి ఐదు వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది.

కాగా దీపావళి చెత్త అదనంగా మరో రెండు వేలతో కలుపుకొని దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి కాల్చిన పటాకుల చెత్తను మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా సేకరించకపోవడంతో పలు ప్రాంతాల్లోని కాలనీ, బస్తీలు, మెయిన్ రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమిచ్చాయి. దీంతో కాలనీ, బస్తీవాసులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ విషయమై పలువురు అధికారులను సంప్రదిస్తే సాయంత్రం ఐదున్నర గంటలకు కూడా ఇంకా చెత్త సేకరణ చేస్తున్నామని, ఎన్ని టన్నులన్నది ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సి ఉందని సమాధానమిచ్చారు.

క్షేత్రస్థాయి విధులు నిల్

సోమవారం పండుగ రోజున సెలవు, మరుసటి రోజైన మంగళవారం పనిదినంగా సర్కారే ప్రకటించిన జీహెచ్ఎంసీ శానిటేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విధులకు దూరంగా ఉన్నారు. కేవలం స్వీపర్లు మాత్రమే చిత్తశుద్ధితో తెల్లవారుఝాము నుంచి రోడ్లను ఊడ్చే పనులు చేపట్టారే తప్ప, వారి విధులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, పోగవుతున్న చెత్తను తరలించేందుకు అదనపు వాహనాలను సమకూర్చడంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ జోన్‌లోనూ మెడికల్ ఆఫీసర్లు గానీ, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లు గానీ పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించలేదని సమాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి

1.గులాబీకి అభ్యర్థి గుబులు.. ఆ నేతల్లో పెరుగుతున్న టెన్షన్

2.రండి..బాబూ రండి! రాజీవ్ స్వగృహా ఇళ్ల అమ్మకానికి సర్కార్ మల్లగుల్లాలు

Next Story