రాత్రి అయిన మహిళ వీఆర్ఏలను వదలని పోలీసులు..!

by Satheesh |
రాత్రి అయిన మహిళ వీఆర్ఏలను వదలని పోలీసులు..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వీఆర్ఏలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారిని వేరే శాఖలకు అటాచ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే వీఆర్ఏలు పలు రకాలుగా ఆందోళనలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న వీఆర్ఏలను మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు తరలించినట్లు వీఆర్ఏలు తెలిపారు. సుమారు 50 మంది మహిళా వీఆర్ఏలను గోషామహల్ స్టేడియంకు, మరో 60 మందిని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అప్పటి నుండి రాత్రి 8 గంటలు అయినా వారిని అక్కడి నుండి వదలకుండా నిర్బంధించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అన్నం పెట్టారని, రాత్రి 8 గంటలు అయినా ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, పది నిమిషాల్లో పంపిస్తామంటూ సాయంత్రం నుండి పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిమ్మ చీకట్లో తమను నిర్బంధించారని మేము చేసిన తప్పు ఏంటో చెప్పాలని, తమను పోలీస్ స్టేషన్‌ల నుండి వెంటనే ఇండ్లకు పంపించి వేయాలని వారు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed