'డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి'

by Vinod kumar |
డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నేరస్తుడిని కఠినంగా శిక్షించడంతో పాటు పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని యధావిధిగా నడపాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల యాజమాన్యాలకు అధిక ఫీజుల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల భద్రత మీద లేదని మండిపడ్డారు. నిందితుడు గతంలో కూడా అభం శుభం తెలియని చాలా మంది చిన్నారులపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారని, నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డీఏవీ పాఠశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడపాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు అంజన్న యాదవ్, మహీందర్ నాయుడు, శేఖర్ గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Next Story