పబ్స్ అండ్ బార్స్ ఓనర్స్‌కు కమిషనర్ సీవీ ఆనంద్ వార్నింగ్

by Vinod kumar |   ( Updated:2022-05-13 16:51:37.0  )
పబ్స్ అండ్ బార్స్ ఓనర్స్‌కు కమిషనర్ సీవీ ఆనంద్ వార్నింగ్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కొంత మంది బార్లు, పబ్బుల యజమానులు లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అటువంటి వారు వెంటనే తమ తీరు మార్చుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని బార్స్ అండ్ రెస్టారెంట్స్, పబ్బుల యజమానులు, డ్రైవ్-ఇన్ రెస్టారెంట్స్ యజమానులతో బషీర్ బాగ్‌లోని కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో పలు సలహాలు, సూచనలు చేశారు. ఇటీవల మింక్ అండ్ పుడ్డింగ్ పబ్‌లో పోలీసులు చేపట్టిన తనిఖీలో కొకైన్ పట్టుబడిందని, పబ్బులలో పెద్ద శబ్దాలతో డీజేలు పెడుతుండటంతో పరిసర ప్రాంతాలలో ఉండే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని, ఈ విషయంలో తరచుగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా పబ్బులలో మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ఇష్టారీతిగా వాహనాలు నడుపుతున్నారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పబ్బుల్లో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందని తమ శాఖ చేసిన అంతర్గత విచారణలో తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇటువంటి తరుణంలో లాభాల కోసం అడ్డదారులు తొక్కి నగరాన్ని అపఖ్యాతి పాలు చేయడం తగదని సీపీ సూచించారు. పోలీస్ యాక్ట్ నిబంధనల మేరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వ్యాపారం కొనసాగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా నిర్దేశించబడిన వయసు కన్నా తక్కువ వయస్సు గల వారిని పబ్బులోనికి అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు.


పబ్‌లు, రెస్టారెంట్లలో 30 రోజుల బ్యాకప్‌తో కూడిన సీసీటీవీల ఏర్పాటు చేయాలని, ప్రాంగణంలో సౌండ్ ప్రూఫింగ్, వ్యాలెట్ డ్రైవర్లు, సిబ్బంది, కస్టమర్లను తరచుగా మానిటరింగ్ చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు. రాత్రి 11 గంటల తరువాత వచ్చిన ఆర్డర్‌లను అంగీకరించరాదని, 12 గంటల లోపు వాటిని మూసివేయాలని సీపీ సూచించారు. శుక్ర, శనివారాలలో అరగంట గ్రేస్ పీరియడ్‌తో పాటు అదనంగా 1 గంట మినహాయింపు ఉంటుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందు లైట్లను డిమ్ చేస్తారని, తద్వారా కస్టమర్లు పబ్బు మూసి వేసే సమయమైందని తెలుసుకుంటారని, నగరంలో కూడా ఈ పద్ధతిని అవలంబించాలని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ ప్రయాణికులు లేదా ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని స్టార్ రేటింగ్ ఉన్న హోటళ్లలో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉంచబడుతుందని, ఇది సాధారణ ప్రజలకు కాదని ఆయన స్పష్టం చేశారు. 24 గంటలు మద్యం అందించే బార్లు, రెస్టారెంట్లు పబ్బులకు ఇకపై అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ(క్రైమ్స్ అండ్ సిట్) ఏ.ఆర్. శ్రీనివాస్, జాయింట్ సీపీ (అడ్మిన్) యం. రమేష్ , జాయింట్ సీపీ. ఎస్.బి.పి. విశ్వ ప్రసాద్, 5 జోన్లకు చెందిన డిసీపీ లు, ఇతర పోలీసు అధికారులు, 100 మందికి పైగా సంస్థల యజమానులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed