- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శేరిలింగంపల్లి బీజేపీ నాయకుల వర్గ పోరు.. నడిరోడ్డుపై బాహాబాహీ

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ పార్టీలోని అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఇన్నాళ్లు అంతర్లీనంగా ఉన్న తగవులు కాస్త బహిరంగ మయ్యాయి. ఏకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నంతగా దిగజారారు బీజేపీ నాయకులు. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు కుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ లోని ఓ వర్గం చెరువులు సందర్శనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, గజ్జల యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, ప్రభాకర్ యాదవ్, నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్‌లతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి లోని రంగనాథ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న దేవుని(చిన్న) చెరువును పరిశీలించారు.
ఈ క్రమంలో మువ్వా సత్యనారాయణ వ్యక్తిగత కార్యదర్శి మధు తో పాటు ఆయన డ్రైవర్ చెరువు ఫోటోలు తీస్తుండగా కొందరు స్థానికులు వారిపై దాడికి దిగారు. మా చెరువు వద్ద మీకేమి పనంటూ వారిని చితకబాదారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మొవ్వా సత్యనారాయణపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆయనను హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకులే పరస్పరం దాడులకు దిగడంతో ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్రతిపక్ష నాయకులే కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ఈ ఘటనతో తేటతెల్లం అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాపై దాడి చేసింది కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అనుచరులే: మొవ్వా
తనపై దాడి చేసింది స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అనుచరులుగా పేర్కొంటూ మొవ్వా సత్యనారాయణ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారిని, అందుకు ప్రోత్సహించిన గంగాధర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి తీసుకువెళ్లినట్టు సమాచారం. కాగా గచ్చిబౌలి డివిజన్ లోని చెరువుల సందర్శనకు వచ్చిన బీజేపీ నాయకులు సొంత పార్టీకి చెందిన స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కి సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు.
మోవాను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొవ్వా సత్యనారాయణను పలువురు బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.