చైన్ స్నాకింగ్, వాహనాల దొంగలు అరెస్ట్

by srinivas |   ( Updated:2022-10-08 13:28:09.0  )
చైన్ స్నాకింగ్, వాహనాల దొంగలు అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేరువేరు సంఘటనల్లో చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదాపూర్ డిసిపి శిల్పావళి తెలిపారు. ఈ రెండు దొంగతనాలకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఒంటరి మహిళలే టార్గెట్ గా చేసుకుని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన మలిశెట్టి నరేష్(35) చెడు అలవాట్లకు, జల్సాలకు బానిసై చైన్ స్నాచింగ్, క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6న మియాపూర్ మయూరి నగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో ఉన్న చైన్ ను లాక్కుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగతనాలకు పాల్పడేందుకు నిందితుడు ఉపయోగించిన పల్సర్ బైక్ సైతం గచ్చిబౌలిలో దొంగిలించినది గా గుర్తించారు. నిందితుడి వద్ద నుండి ఒక పల్సర్ ద్విచక్ర వాహనం, ఒక బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై గతంలో మొబైల్ స్నాచింగ్ కేసు కూడా నమోదయి ఉన్నట్లు డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధలో ఈనెల 1న తన లారీ పోయిందని యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లేబర్ గా పనిచేస్తున్న నార్ల మల్లేష్(32), ముడావత్ శ్రీను(32) ఇద్దరు కలిసి లారీని దొంగిలించారని గుర్తించారు. బాచుపల్లిలోని పార్కింగ్ ప్రదేశంలో లారీని ఉంచిన నిందితులు. అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడు నార్ల మల్లేష్ పై వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో మొత్తం 11 చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి రూ.8 లక్షల విలువ చేసే లారీ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈ సమావేశంలో మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, మియాపూర్ సీఐ తిరుపతి రావు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story