వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి: నరేంద్రసింగ్ తొమర్

by Disha Web Desk 16 |
వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి: నరేంద్రసింగ్ తొమర్
X
దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తొమర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఆయన పర్యటించారు. ఐకార్ ఆధ్వర్యంలోని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులకు శిక్షణ ఇచ్చే విస్తరణ విద్యా సంస్థలో సోమవారం నూతన ఆడిటోరియంను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ రంగ పెట్టుబడులలో పరిశోధన, విస్తరణ రంగాల మీద దృష్టిపెట్టాలని సూచించారు. ఐదు రాష్ట్రాలకు ఈ కేంద్రం సేవలు అందిస్తుంది .. దీనికోసం అందుబాటులో అన్నిరకాల సాంకేతికతను వాడుకోవాలని సూచించారు. పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, రైతులకు సాంకేతికత ఆధారంగా అవగాహన కల్పించాలన్నారు.

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతుకు చేసే మేలు జాతి సంపద సృష్టికేనని, అది రైతు కుటుంబానికో, రైతుకో ఇచ్చినట్లు కాదన్నారు. ప్రభుత్వాలు రైతుకు చేయూతనిస్తేనే దేశ ప్రగతి సాధ్యమన్నారు. భారత్ వ్యవసాయరంగంపైనే ఆధారపడి ఉందని, కేంద్రమైన, రాష్ట్రమైనా వ్యవసాయం మీద దృష్టి పెట్టాలన్నారు. గత 9 ఏళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం అందించి దానిని దేశానికి ఒక దిక్సూచిలా అభివృద్ధి చేశామన్నారు. సాగునీటిపై దృష్టిపెట్టి ప్రపంచంలో ఎత్తయిన కాళేశ్వరం నిర్మించి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయతో 46 వేల చెరువులు, కుంటలు పునరుద్దరించామని స్పష్టం చేశారు.

విద్యుత్ మౌళిక సదుపాయాలు ఏర్పాటుచేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏటా పదివేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ రైతుబంధు పథకం తర్వాత కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభించిందన్నారు. ఆయిల్ పామ్ సాగుతో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తున్నామన్నారు. పంటల నిల్వ కోసం గోదాంల నిర్మాణం చేపట్టామని, పంటలు అమ్ముకునేందుకు మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిచామన్నారు. వరిధాన్యంతో పాటు ఇతర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా, రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, వీసీ రఘునందన్ రావు, విస్తరణ సంచాలకురాలు డాక్టర్ సుధారాణి, ఈఈఐ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read..

ట్రాఫిక్​ కానిస్టేబుల్‌ను అభినందించిన రాచకొండ సీపీ

Next Story

Most Viewed