గిరిక తాళ్లతో ఎంతో లాభం: Vinod Kumar

by Disha Web Desk 16 |
గిరిక తాళ్లతో ఎంతో లాభం: Vinod Kumar
X
  • హరితహారంలో తాటిచెట్లు
  • కోటి మొక్కలు నాటే లక్ష్యం
  • వర్షాకాలం ప్రారంభం నుంచే స్టార్ట్
  • సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో ప్రయారిటీ
  • ఒక్కో చెట్టుకు 12 లీటర్ల కల్లు వస్తుందన్న వినోద్ కుమార్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి గిరిక తాళ్ల మొక్కలను పెంచేందుకు అటవీ, ఎక్సైజ్ శాఖ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. మంత్రుల నివాసంలో కరీంనగర్ గౌడ సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. తాటి చెట్టు పైనుంచి పడి మృతి చెందినా.. గాయపడినా మెడికల్ బోర్డ్ నుంచి ధృవీకరణ పత్రాలను తీసుకునే నిబంధనను రద్దు చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సివిల్ సర్జన్ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే గీత కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందే విధంగా చూడాలని ప్రతినిధులు కోరారు. ఎక్స్ గ్రేషియాను సత్వరమే అందే విధంగా చూడాలని కోరారు. టూవీలర్స్ సబ్సిడీపై అందజేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా వినోద్ కుమార్ స్పందించి.. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లతో మాట్లాడి ఈ అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గిరిక తాళ్లతో గౌడ సామాజిక వర్గానికి ఎంతో లాభం కలుగుతుందన్నారు. ఒక చెట్టు ద్వారా కనీసం 12 లీటర్ల కల్లు వస్తుందని, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుల ప్రాంతాలతోపాటు చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో గిరిక తాళ్ల మొక్కలు నాటేందుకు అటవీ, ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ గౌడ సంఘం ప్రతినిధులు కే. సత్యనారాయణ గౌడ్, కే. మహేందర్ గౌడ్, దూలం సంపత్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, కలర్ సత్తన్న, వై. అనిల్, కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మాధవి కృష్ణ, జయశ్రీ, భూమా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed